CM Vijay : తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయాలు.. ఆరోగ్య బీమా రూ.25లక్షలకు పెంపు,ఎమ్మెల్యేలకు ప్రభుత్వ కార్లు
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు ప్రజలకు ముఖ్యమంత్రి విజయ్ కీలక ప్రకటనలు చేశారు. ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం కింద ఇప్పటివరకు ఒక్కో కుటుంబానికి ఏటా అందుతున్న రూ.5లక్షల బీమా మొత్తాన్ని రూ.25లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఆదాయం,ప్రాంతం వంటి తేడాలు లేకుండా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మెరుగైన,నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని సీఎం తెలిపారు. అదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్థ ఆవిన్ ద్వారా పాల ఉత్పత్తిదారుల నుంచి సేకరించే పాల ధరను కూడా పెంచుతున్నట్లు విజయ్ ప్రకటించారు. ప్రస్తుతం లీటరు పాలకు రూ.38గా ఉన్న సేకరణ ధరను రూ.41కు పెంచుతున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 3.16లక్షల మందికి పైగా పాల ఉత్పత్తిదారులకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
వివరాలు
ఖర్చుల కోసం ప్రతి ఎమ్మెల్యేకు నెలకు రూ.75,000 ప్రత్యేక అలవెన్స్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంతగా అనుకూలంగా లేకపోయినా.. పాల ఉత్పత్తిదారుల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని సేకరణ ధర పెంచినట్లు సీఎం విజయ్ వివరించారు.
తాజా పెంపు కారణంగా ప్రభుత్వంపై ప్రతి నెలా అదనంగా రూ.30 కోట్ల ఆర్థిక భారం పడుతుందని వెల్లడించారు.
గతంలో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం పాల సేకరణ ధర పెంపు కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు.
ఇక రాష్ట్ర ఎమ్మెల్యేలకు ప్రభుత్వ ఖర్చుతో కార్లను సమకూర్చనున్నట్లు సీఎం విజయ్ మరో కీలక ప్రకటన చేశారు.
ఈ వాహనాల నిర్వహణతో పాటు ఇంధనం, డ్రైవర్ జీతం వంటి ఖర్చుల కోసం ప్రతి ఎమ్మెల్యేకు నెలకు రూ.75,000 ప్రత్యేక అలవెన్స్ అందించనున్నట్లు తెలిపారు.