
సీబీఐకి షాకిచ్చిన సీఎం స్టాలిన్; అనుమతులుంటేనే తమిళనాడులోకి ఎంట్రీ
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కేసుల విచారణకు సీబీఐకి ఇచ్చే మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
దిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, 1946లోని సెక్షన్ 6 ప్రకారం, ఏదైనా కేసులో దర్యాప్తు చేయడానికి ముందు సీబీఐ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది.
పైన పేర్కొన్న నిబంధన ప్రకారం 1989-1992లో కొన్ని రకాల కేసులకు ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకుంటూ తమిళనాడు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
దీని ప్రకారం, రాష్ట్రంలో దర్యాప్తు చేసేందుకు సీబీఐ ఇక నుంచి తమిళనాడు ప్రభుత్వ అనుమతిని పొందవలసి ఉంటుంది.
సీబీఐ
10 రాష్ట్రాల్లో సీబీఐకి నో ఎంట్రీ
తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని జాబ్ కుంభకోణంలో ఈడి అరెస్టు చేసిన కొన్ని గంటల తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సీబీఐకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది.
దేశంలో మొత్తం తొమ్మిది రాష్ట్రాలు సీబీఐకి తమ మద్దతును ఉహసంహరించుకున్నాయి.
గతేడాది ఆగస్టు 30న తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, రాజస్థాన్, జార్ఖండ్, మిజోరం, మేఘాలయ, కేరళ, తెలంగాణ, తమిళనాడుతో కలిపి మొత్తం రాష్ట్రాలు సీబీఐకి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్నాయి.
మహారాష్ట్రలో ఎంవీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మద్దతును ఉపసంహరించుకుంది. ఏన్ నాథ్ షిండ్ సీఎం అయ్యాక మళ్లీ పునరుద్ధరించారు.