Telangana : ట్యాంపర్ ప్రూఫ్‌గా స్మార్ట్ రేషన్ కార్డులు.. ఆగస్టు 15 నుంచి పంపిణీ
ఈ వార్తాకథనం ఏంటి
రేషన్ వ్యవస్థలో పారదర్శకతను మరింత పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం ట్యాంపర్ ప్రూఫ్ స్మార్ట్ రేషన్ కార్డులను సిద్ధం చేసింది. వీటి ప్రింటింగ్ ప్రక్రియ పూర్తికావడంతో కార్డులను ఆయా జిల్లాలకు పంపించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని మిగిలిన 32 జిల్లా కేంద్రాల్లోనూ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
వివరాలు
1.05 కోట్లకు చేరిన రేషన్ కార్డుల సంఖ్య
ప్రజా ప్రభుత్వం ఇప్పటివరకు 16.32 లక్షల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం శనివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
కొత్త కార్డుల ద్వారా అదనంగా 61.09 లక్షల మంది ఆహార భద్రత పరిధిలోకి వచ్చినట్లు తెలిపింది.
కొత్త కార్డుల మంజూరుతో తెలంగాణలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 1.05 కోట్లకు చేరిందని ప్రభుత్వం పేర్కొంది.
వీటి ద్వారా రాష్ట్రంలో 3.42 కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రత లభిస్తోందని వివరించింది.
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు ప్రతి నెల సుమారు 2.16 లక్షల టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించింది.
వివరాలు
జిల్లాల్లో కలెక్టర్లదే బాధ్యత
జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన ప్రణాళిక, సమన్వయం, అమలు బాధ్యతలను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది.
పౌరసరఫరాలు, రెవెన్యూ, పోలీసు శాఖలతో పాటు ఇతర సంబంధిత శాఖలను సమన్వయం చేసుకుని పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలని ఆదేశించింది.
కార్డుల పంపిణీకి ముందే జిల్లాల వారీగా లబ్ధిదారుల జాబితాలను ఖరారు చేసి, వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్లకు సూచించింది.
ఇప్పటికే సిద్ధంగా ఉన్న లామినేటెడ్ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ కేంద్రాలకు సురక్షితంగా, నిర్ణీత సమయంలో చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
పంపిణీ కార్యక్రమాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించి, కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం సూచించింది.
వివరాలు
సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్
స్మార్ట్ రేషన్ కార్డుల కోసం వచ్చే వృద్ధులు, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
కార్డుల పంపిణీ సమయంలో లబ్ధిదారులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించింది.
పంపిణీ ప్రక్రియ పురోగతిని ప్రతిరోజూ పర్యవేక్షించి, సంబంధిత వివరాలను పౌరసరఫరాల కమిషనర్‌కు నివేదించాలని కలెక్టర్లను ఆదేశించింది.
జిల్లాల్లో కార్డుల పంపిణీని పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులను నోడల్ అధికారులుగా ప్రభుత్వం నియమించింది.
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లకు సర్క్యులర్ జారీ చేశారు.