Page Loader
ATC: రాష్ట్రంలో టాటా టెక్నాలజీస్‌ ఏటీసీ.. కందుకూరులో ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి
ఆరు అడ్వాన్స్‌డ్‌ కోర్సులతో శిక్షణ, ఉపాధి

ATC: రాష్ట్రంలో టాటా టెక్నాలజీస్‌ ఏటీసీ.. కందుకూరులో ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 15, 2024
08:34 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వం టాటా టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ (టీటీఎల్‌)తో కలిసి తొలి అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ (ఏటీసీ)ను నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పంజాగూడ గ్రామంలోని సర్వే నంబర్‌ 90లోని రెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ సెంటర్‌ ఏర్పాటుకు అనుమతి లభించింది. ఈ మేరకు కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఏటీసీ ఏర్పాటుకు మొత్తం రూ.42.64 కోట్ల వ్యయం చేయనున్నారు. ఈ మొత్తం వ్యయానికి టాటా టెక్నాలజీస్‌ రూ.31.01 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ నిధులతో ఏటీసీకి అవసరమైన సాఫ్ట్‌వేర్, యంత్రాలు, మానవ వనరులను సమకూర్చనుంది. నిర్మాణ పనులు, విద్యుదీకరణ, ఇతర ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.

వివరాలు 

వచ్చే ఏడాది నుంచి ప్రవేశాలు 

ఈ ఏటీసీలో రెండేళ్ల కాలపరిమితితో ఆరు అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి, అందులో 244 సీట్లు ఉండనున్నాయి. వచ్చే ఏడాది నుంచి ఈ కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. టీటీఎల్‌ సంస్థ ఐదేళ్లపాటు ఏటీసీలకు అవసరమైన సాంకేతికత, ఇతర మానవ వనరులను అందించనుంది. ఐదేళ్ల తరువాత, మారుతున్న పరిణామాల ఆధారంగా కొత్త కోర్సులు, సాంకేతికతలు, మానవ వనరులను అందించేందుకు ఒప్పందం పొడిగించుకునే అవకాశం ఉంది. ఉపాధి అవకాశాలు ఏటీసీ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పన శాఖ ద్వారా తగిన చర్యలు తీసుకోనుంది.