AI Data Center: రూ.70 వేల కోట్లతో హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్.. టీసీఎస్ భారీ ప్లాన్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రం గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)విప్లవంలో మరో కీలక మైలురాయిని సాధించింది. దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అనుబంధ సంస్థ హైపర్‌వాల్ట్ ముందుకొచ్చింది. ఫ్యూచర్‌సిటీలో ఈ భారీ డేటా సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం హైపర్‌వాల్ట్, దాని భాగస్వామ్య సంస్థలు కలిసి రూ.70 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 7 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సచివాలయంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో టీసీఎస్ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నారు.
వివరాలు
దావోస్ భేటీతో ప్రాజెక్టుకు బీజం
టీసీఎస్ తరఫున సంస్థ సీఈవో కృతివాసన్, హైపర్‌వాల్ట్ డేటాసెంటర్ సీఈవో దీపేశ్‌నంద, ఉపాధ్యక్షుడు రాజన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓపెన్‌ఏఐ చీఫ్ టెక్నాలజీ అధికారి ఉదయ్ రుద్రరాజు హాజరయ్యారు.
ఈ భారీ ప్రాజెక్టుకు ఈ ఏడాది జనవరిలో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లోనే బీజం పడింది. అప్పట్లో సీఎం రేవంత్‌రెడ్డి, టాటాసన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ మధ్య జరిగిన సమావేశంలో ప్రాజెక్టు ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
కేవలం ఎనిమిది నెలల వ్యవధిలోనే మిగతా ఐదు పోటీ రాష్ట్రాలను వెనక్కి నెట్టి తెలంగాణ ఈ ప్రాజెక్టును దక్కించుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం టీసీఎస్ ప్రతినిధులతో పలుమార్లు చర్చలు జరపడంతో ప్రాజెక్టు కొద్దినెలల్లోనే కార్యరూపం దాల్చిందని అధికారవర్గాలు వెల్లడించాయి.
వివరాలు
'ప్రపంచంలోనే ఏఐలో హైదరాబాద్ అగ్రగామిగా నిలుస్తుంది'
ఎంవోయూ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏఐ విప్లవంలో హైదరాబాద్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవబోతోందని అన్నారు. దేశానికే ఇది చరిత్రాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఫ్యూచర్‌సిటీ తన కల అని, తెలంగాణ రైజింగ్ విజన్‌లో భాగంగా 2034 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఈ ఆర్థిక లక్ష్యాలను సాధించే కార్యాచరణలో ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టు కీలక ముందడుగని సీఎం పేర్కొన్నారు.
1994 తర్వాత రాష్ట్రంలో చంద్రబాబునాయుడు అనేక పెట్టుబడులను తీసుకొచ్చారని, అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ ప్రక్రియను కొనసాగించారని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఆ తర్వాత పదేళ్లపాటు భారాస ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు.
వివరాలు
పెట్టుబడుల విధానాల విషయంలో ఎలాంటి మార్పులుండవు
ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినప్పుడు పాలసీలు మారుతుంటాయని, తెలంగాణలో మాత్రం రాజకీయాలు, సిద్ధాంతాల విషయంలో పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ పెట్టుబడుల విధానాల విషయంలో ఎలాంటి మార్పులు లేకుండా ఇన్వెస్టర్లకు భరోసా కల్పిస్తున్నామని చెప్పారు.
ఫ్యూచర్‌సిటీలో ఏర్పాటు చేయనున్న రేడియల్ రోడ్డుకు భారతరత్న, దివంగత రతన్ టాటా పేరు పెట్టినట్లు సీఎం తెలిపారు.
హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు టీసీఎస్-హైపర్‌వాల్ట్ ముందుకు రావడం అభినందనీయమన్నారు.
ఈ ప్రాజెక్టును పూర్తి చేసి 2028 జూన్ 2న ప్రారంభించాలని సంస్థ ప్రతినిధులను సీఎం కోరారు.
వివరాలు
ఏఐ దిగ్గజాలు హైదరాబాద్ వైపు: శ్రీధర్‌బాబు
మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఈ ఏడాది దావోస్‌లో టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌ను కలిసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారని తెలిపారు.
ఆ విజ్ఞప్తికి స్పందించి రాష్ట్రంలో రూ.70 వేల కోట్ల పెట్టుబడికి టాటా సంస్థ ముందుకు రావడం ప్రభుత్వంపై, సీఎం ఆలోచనా విధానంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు.
ఫ్యూచర్‌సిటీకి ఎవరొస్తారంటూ కొందరు సందేహాలు వ్యక్తం చేశారని, వాటిని పటాపంచలు చేస్తూ ఇప్పుడు ఇంత భారీ పెట్టుబడి వచ్చిందని చెప్పారు.
రాష్ట్రంలో అమలు చేయనున్న తెలంగాణ రైజింగ్ కార్యక్రమం గురించి వివరిస్తుండటంతోనే పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు.
వివరాలు
క్లౌడ్, ఇంజినీరింగ్, సమాచార మార్పిడికి అనుసంధానం
టీసీఎస్ సీఈవో కృతివాసన్ మాట్లాడుతూ.. ఏఐ వద్ద ఉన్న సమాచారాన్ని క్లౌడ్, ఇంజినీరింగ్, సమాచార మార్పిడి వంటి అంశాలతో అనుసంధానిస్తామని తెలిపారు.
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంటెలిజెన్స్ వంటి అంశాలను ముందుకు తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించి డేటా సెంటర్‌కు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసిందని వెల్లడించారు.
హైపర్‌వాల్ట్ ఇండియా సీఈవో దీపేశ్‌నంద మాట్లాడుతూ.. ఏఐలో భవిష్యత్తులో చోటుచేసుకునే పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకుని డేటా సెంటర్‌కు అవసరమైన అత్యాధునిక మౌలిక వసతులను కల్పిస్తామని తెలిపారు.
హైపర్‌వాల్ట్ ఉపాధ్యక్షుడు రాజన్న మాట్లాడుతూ.. ప్రస్తుతం టీసీఎస్ ద్వారా 83 వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారని, ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో మరింత మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు.
వివరాలు
ప్రాజెక్టు ప్రత్యేకతలు
హైపర్‌వాల్ట్, దాని భాగస్వామ్య సంస్థలు కలిసి డేటా సెంటర్ నిర్మాణం, నిర్వహణ కోసం రూ.70 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి.
హైదరాబాద్‌లో 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఈ డేటా సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నారు.
డేటా సెంటర్‌కు 1 గిగావాట్ (1,000 మెగావాట్ల) సామర్థ్యం ఉంటుంది.
గ్రీన్ ఎనర్జీ, వాటర్-న్యూట్రల్ (నీటి వృథా లేని) డిజైన్లతో ప్రాజెక్టును నిర్మించనున్నారు.
ఆధునిక లిక్విడ్ కూలింగ్ కంప్యూటింగ్ సహా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు.
ప్రపంచంలోని అగ్రశ్రేణి ఏఐ కంపెనీలు, హైపర్‌స్కేలర్లు, గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్‌లకు అవసరమైన సేవలను అందించేలా డేటా సెంటర్‌ను తీర్చిదిద్దనున్నారు.
వివరాలు
అత్యంత భారీ డీల్స్‌లో ఇదొకటి
ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉంది. హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్న కేంద్రం దాని సామర్థ్యాన్ని అధిగమించనుంది.
ఒక రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్య సంస్థ మధ్య కుదిరిన ఒప్పందాల్లో ఇది అత్యంత భారీ డీల్స్‌లో ఒకటిగా నిలవనుంది.
ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 7 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.
ప్రాజెక్టును 2028 జూన్ 2 నాటికి పూర్తి చేసి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.