TDP and YSRCP: పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వ్యవహారంపై పార్టీ శ్రేణులకు టీడీపీ,వైసీపీ కీలక ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ, సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంపై తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కీలక ఆదేశాలు జారీ చేశాయి. వ్యక్తిగత విషయాలపై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, విమర్శలు చేయడం, అనవసర చర్చలకు దిగడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా కొణిదెల తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ఉమ్మడి ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. పరస్పర అంగీకారం, గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వారు వెల్లడించారు.
వివరాలు
టీడీపీ,వైసీపీ అపప్రమత్తం
ఇకపై మంచి స్నేహితులుగా, పిల్లలకు బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా కొనసాగుతామని స్పష్టం చేశారు. తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు, విమర్శలు, పోస్టుల విషయంలో టీడీపీ, వైసీపీ అప్రమత్తమయ్యాయి.
తమ పార్టీ శ్రేణులు ఈ అంశంపై సంయమనం పాటించాలని సూచించాయి.
వివరాలు
వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు వద్దు.. ఐటీడీపీ హెచ్చరిక
పవన్ కల్యాణ్ వ్యక్తిగత వ్యవహారాలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం ఐటీడీపీ స్పష్టం చేసింది.
రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెట్టడం, విమర్శలు చేయడం, అనవసర చర్చలు నిర్వహించడం వంటి వాటికి దూరంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించింది.
సోషల్ మీడియాలో పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు చేసే వ్యక్తిగత వ్యాఖ్యలకు ఐటీడీపీ బాధ్యత వహించదని పేర్కొన్నట్లు సమాచారం.
పార్టీ విధానాలకు విరుద్ధంగా, అనుచితంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ప్రతి ఒక్కరూ గౌరవం, బాధ్యతతో వ్యవహరించాలని సూచించింది. రాజకీయ విమర్శల కోసం నాయకుల వ్యక్తిగత జీవితాలను వేదికగా చేసుకోవద్దని స్పష్టం చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తెలుగుదేశం పార్టీ చేసిన ట్వీట్
Dignity in public discourse is non-negotiable..
— iTDP Official (@iTDP_Official) November 9, 2026
iTDP will not tolerate personal attacks on anyone, from any side..
Service to the Telugu people is the only conversation that matters..#iTDP #RespectRestraintResponsibility pic.twitter.com/a2TkFn4l4S
వివరాలు
నేతలు, కార్యకర్తలకు వైసీపీ కీలక ఆదేశాలు
మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తమ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా విభాగాలకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
రాజకీయ నాయకుల వ్యక్తిగత విషయాలపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది.
అయితే, సంబంధిత వ్యక్తుల వ్యక్తిగత గోప్యతను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేసింది.
పవన్ కల్యాణ్ వ్యక్తిగత వ్యవహారానికి సంబంధించి ఎవరూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ శ్రేణులను ఆదేశించింది.
వివరాలు
నేతలు, కార్యకర్తలకు వైసీపీ కీలక ఆదేశాలు
ఈ అంశంపై పోస్టులు పెట్టడం, ఇతరులు పెట్టిన పోస్టులకు స్పందించడం, కామెంట్లు చేయడం వంటివి చేయకూడదని సూచించింది.
అంతేకాకుండా వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన కంటెంట్‌ను షేర్ చేయడం, ప్రచారం చేయడం, అనవసర చర్చలకు దిగడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది.
పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా విభాగానికి చెందిన వారంతా ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.
సోషల్ మీడియాలో సమాచారాన్ని పంచుకునే సమయంలో సంయమనం, బాధ్యతాయుతమైన వైఖరిని ప్రదర్శించాలని కోరింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైసీపీ పార్టీ చేసిన ట్వీట్
🚨 OFFICIAL NOTE
— Jagananna Connects (@JaganannaCNCTS) November 10, 2026
Party Leaders, Cadre & Social Media Activists are requested to refrain from commenting on or sharing content concerning the personal matters of political leaders.
All concerned are urged to respect privacy and exercise discretion in public communications.
-… pic.twitter.com/i5CcIDeLkz
వివరాలు
రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం!
సాధారణంగా తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ విమర్శలు,సోషల్ మీడియా వేదికగా పోరు కొనసాగుతుంటాయి.
అయితే పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశంపై రెండు పార్టీలు దాదాపు ఒకే తరహా సూచనలు చేయడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
ఒకవైపు పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని ప్రజలను కోరారు.
మరోవైపు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా తమ నాయకులు, కార్యకర్తలు ఈ విషయంలో సంయమనం పాటించాలని ఆదేశించాయి.
రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ నాయకుల వ్యక్తిగత జీవితాలను గౌరవించాలనే సందేశం ఈ పరిణామాల ద్వారా వెలువడుతోంది.
ఇకపై సోషల్ మీడియాలో ఈ అంశంపై ఆయా పార్టీల శ్రేణులు ఎలా వ్యవహరిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.