Kuppam: కుప్పం మున్సిపాలిటీలో తెదేపా ప్రభంజనం.. 19 వార్డుల్లో 18 స్థానాలు గెలుపు
ఈ వార్తాకథనం ఏంటి
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ (తెదేపా) ఘనంగా కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులు తిరుగులేని విజయం సాధించారు. పోలైన ఓట్లలో 72.43 శాతం ఓట్లు మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి రాజ్‌కుమార్‌కు దక్కాయి. ఆరు రౌండ్ల ఓట్ల లెక్కింపులోనూ వైకాపా ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది. తెదేపాకు 15,536ఓట్ల భారీ ఆధిక్యం లభించడంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. తెదేపా అభ్యర్థి రాజ్‌కుమార్‌కు 22,622ఓట్లు రాగా, వైకాపా అభ్యర్థి విజయ్‌కుమార్‌కు 7,086ఓట్లు వచ్చాయి. నోటాకు 454, కాంగ్రెస్‌కు 259, బీఎస్పీకి 148 ఓట్లు పోలయ్యాయి. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులకు కలిపి 90 ఓట్లు వచ్చాయి. మరో 576 ఓట్లు చెల్లకుండా పోయాయి.
వివరాలు
అభివృద్ధికి ఓటు
కుప్పం మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులు ఉండగా, వాటిలో 13 స్థానాలను తెదేపా ఏకగ్రీవంగా గెలుచుకుంది.
మంగళవారం 19 వార్డులకు ఓట్ల లెక్కింపు జరగ్గా, 18 స్థానాల్లో తెదేపా అభ్యర్థులు విజయం సాధించారు.
ఎనిమిదో వార్డులో తెదేపా మద్దతుతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి ప్రదీప్ గెలుపొందారు.
గత తెదేపా ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను గుర్తించిన ఓటర్లు ఆ పార్టీకి మద్దతుగా నిలిచారు.
ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న కుప్పంలో 2019-24 మధ్య వైకాపా శ్రేణులు అరాచకాలకు పాల్పడ్డాయని, దాడులు, దౌర్జన్యాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయని స్థానికులు గుర్తుచేసుకున్నారు.
వివరాలు
అభివృద్ధికి ఓటు
ఈ నేపథ్యంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు 48,006ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.
2009, 2014,2019 ఎన్నికల్లోనూ ఆయనకు ఈ స్థాయి ఆధిక్యం లభించలేదు.
2024 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో తెదేపాకు 59.96శాతం ఓట్లు రాగా,తాజా మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి 72.43శాతం ఓట్లు రావడం విశేషం.
2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఓటర్లు ఈసారి ఆ పార్టీకి గట్టి బుద్ధి చెప్పారు.
అప్పట్లో 25వార్డుల్లో వైకాపా 19స్థానాలు గెలుచుకోగా, తెదేపా ఆరింటికే పరిమితమైంది.
నాడు ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు తమిళనాడు నుంచి నకిలీ ఓటర్లను తీసుకొచ్చి కుప్పం మున్సిపాలిటీని వైకాపా దక్కించుకుందని తెదేపా ఆరోపించింది.
ఈసారి మాత్రం ఓటర్లు తెదేపాకు భారీ విజయాన్ని అందించారు.