Farmers March: శంభు సరిహద్దు వద్ద రైతులపై టియర్ గ్యాస్.. 17 మందికి గాయాలు
శంభు సరిహద్దు వద్ద మరోసారి రైతుల ఉద్యమం తీవ్రంగా మారింది. తమ డిమాండ్ల పరిష్కారానికి గాను రైతులు చేపట్టిన 'దిల్లీ చలో' మార్చ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. హర్యానాపోలీసులు రైతులపై టియర్ గ్యాస్, జల ఫిరంగులను ప్రయోగించడంతో, సుమారు 17 మంది రైతులు గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం, రైతు సంఘాల నేతలు తమ తదుపరి కార్యాచరణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. దిల్లీకి పాదయాత్రను నిలిపివేసిన రైతు నేతలు, తమ డిమాండ్ల పరిష్కారానికి మరోసారి చర్చలు జరిపే అంశాన్ని సమీక్షించాలని తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం 'చలో ఢిల్లీ' మార్చ్ ప్రారంభమైనా హర్యానా పోలీసులు శంభు సరిహద్దు వద్ద రైతులను అడ్డుకున్నారు.
రైతులను అడ్డుకోవడం మూడోసారి
101 మంది రైతులు ఈ మార్చ్‌లో పాల్గొనగా, వారు కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్ల సాధన కోసం ప్రదర్శన చేస్తున్నారు. ఇదే సందర్భంలో, రైతుల దిల్లీ చలో ప్రయత్నాన్ని అడ్డుకోవడం ఇదే మూడోసారి. డిసెంబర్ 6 నుంచి దిల్లీ వైపు వెళ్లేందుకు రైతులు ప్రయత్నించగా, ఇప్పటికే రెండు సార్లు పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ చర్యలపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హర్యానా ప్రభుత్వం, రైతుల 'ఢిల్లీ చలో' కార్యక్రమం నేపథ్యంలో అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్తగా, శనివారం ఉదయం 6 గంటల నుంచి 17వ తేదీ అర్ధరాత్రి వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ప్రకటించింది.