LOADING...
Tejashwi Yadav: ఆర్జేడీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తేజస్వీ యాదవ్‌ నియామకం
ఆర్జేడీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తేజస్వీ యాదవ్‌ నియామకం

Tejashwi Yadav: ఆర్జేడీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తేజస్వీ యాదవ్‌ నియామకం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2026
03:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) పార్టీకి నూతన జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తేజస్వీ యాదవ్‌ నియమితులయ్యారు. పార్టీ కీలక సమావేశంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. అగ్రనేతల సమక్షంలో తేజస్వీ యాదవ్‌కు నియామక లేఖను అందజేశారు. లాలూ కుటుంబంలో అంతర్గత విభేదాలు వెలుగులోకి వస్తున్న తరుణంలో తేజస్వీని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీ భవిష్యత్తు దిశను నిర్దేశించే కీలక బాధ్యతలను తేజస్వీకి అప్పగించినట్లుగా ఈ నిర్ణయాన్ని ఆర్జేడీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Details

అతిపెద్ద పార్టీగా అవతరించంలో తేజస్వీ కీలక పాత్ర

లాలూ ప్రసాద్‌ యాదవ్‌, రబ్రీ దేవిల చిన్న కుమారుడైన తేజస్వీ యాదవ్‌ ప్రస్తుతం పార్టీకి ప్రధాన నాయకుడిగా కొనసాగుతున్నారు. 2020 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ బిహార్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించడంలో తేజస్వీ కీలక పాత్ర పోషించారు. అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో కలిసి తేజస్వీ ఎన్నికల ప్రచారాల్లో చురుకుగా పాల్గొన్నారు. రాఘోపుర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తేజస్వీ, బీజేపీ అభ్యర్థి సతీశ్‌ కుమార్‌పై 14,532 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

Details

మరోసారి కుటుంబ సభ్యులపై తీవ్ర విమర్శలు

ఇదిలా ఉండగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె రోహిణి ఆచార్య మరోసారి తన కుటుంబ సభ్యులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అణగారిన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ఏర్పాటు చేసిన తమ పార్టీని కొందరు వ్యక్తులు పూర్తిగా నాశనం చేయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. ఒకప్పుడు ప్రజల హక్కుల కోసం పోరాడిన ఆర్జేడీ, ప్రస్తుతం ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్తోందని రోహిణి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీ దుస్థితికి కారణమైన వారిని ఆర్జేడీ కార్యకర్తలే ప్రశ్నించే రోజు తప్పదని ఆమె స్పష్టం చేశారు.

Advertisement