Invest Telangana Summit: పెట్టుబడులే లక్ష్యంగా పావులు కదుపుతున్న తెలంగాణ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోకి భారీ పెట్టుబడులను తీసుకురావడంతో పాటు యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్'లో ఏకంగా 11 కొత్త విధానాలను ప్రభుత్వం ఆవిష్కరించనుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత వేగంగా విస్తరించేందుకు ఈ పాలసీలను రూపొందించారు. 'తెలంగాణ రైజింగ్ విజన్ 2047'లో భాగంగా రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి ఈ కొత్త విధానాలు దోహదం చేస్తాయని అధికారులు భావిస్తున్నారు.
Details
తయారీ నుంచి టెక్నాలజీ వరకు ప్రత్యేక పాలసీలు
కొత్తగా తీసుకురానున్న విధానాల్లో ఇండస్ట్రియల్ పాలసీ 2.0 కీలకంగా ఉండనుంది.
తయారీ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు పెట్టుబడిదారులకు మరింత అనుకూలమైన వాతావరణం కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
టెక్స్టైల్స్, ఫుట్వేర్, లెదర్, ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్, లాజిస్టిక్స్ రంగాలకు ప్రత్యేక పాలసీలు రానున్నాయి.
మరోవైపు ఐసీటీ పాలసీ 2.0తో పాటు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ), డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లకు ప్రత్యేక విధానాలను ప్రకటించనున్నారు.
దీంతో సంప్రదాయ పరిశ్రమలతో పాటు కొత్త తరం టెక్నాలజీ రంగాల్లోనూ తెలంగాణ తన అవకాశాలను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.
Details
1,300 మంది ప్రతినిధులతో భారీ సమ్మిట్
మూడు రోజుల పాటు జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్ రాష్ట్రానికి పెట్టుబడుల పరంగా కీలక వేదికగా మారనుంది.
వెయ్యికిపైగా కంపెనీలు, 1,300 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) రంగానికి కూడా ప్రత్యేక విధానం తీసుకురానున్నారు.
అంతేకాదు విదేశీ విశ్వవిద్యాలయాలు తెలంగాణలో తమ క్యాంపస్లు ఏర్పాటు చేసుకునేందుకు అనువైన పాలసీని కూడా ప్రకటించనున్నారు.
మొత్తంగా చూస్తే పరిశ్రమలు, టెక్నాలజీ, విద్య, ఉపాధి...ఈ నాలుగు రంగాలను ఒకేసారి ముందుకు తీసుకెళ్లేలా సమ్మిట్లో కొత్త విధానాలను ప్రభుత్వం తెరపైకి తీసుకురానుంది.