తెలంగాణ: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ నెల నుంచే సన్నబియ్యంతో భోజనం
తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో సన్నబియ్యంతో భోజనాన్ని ఈ నెల నుంచి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి ప్రభుత్వం అంగన్‌వాడీల్లో సన్నబియ్యంతో కూడిన భోజనాన్ని అందిస్తామని ఆరేళ్ల కిందటే ప్రకటించింది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. అయితే ఇటీవల నూతన సచివాలయ ప్రారంభం సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో సన్నబియ్యంతో భోజనాన్ని అందించే ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ప్రభుత్వంపై రూ.5కోట్ల అదనపు భారం
అంగన్‌వాడీ కేంద్రాల్లో దొడ్డు బియ్యంతో భోజనాన్ని పెడుతుండటంతో కొన్ని చోట్ల లబ్ధిదారులు తినడానికి ముందుకు రావడం లేదు. దీంతో ఇంట్లో తిన్న విధంగా ఉండేలా, అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో సన్నబియ్యంతో భోజనాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు పిల్లులు 5.25లక్షలు, బాలింతలు, గర్భిణులు 3.75 లక్షల మంది లబ్ది పొందనున్నారు. 2121టన్నుల సన్న బియాన్ని ఈ నెల నుంచే సరఫరా చేసేందుకు పౌరసరఫరాల శాఖ సిద్ధమవుతోంది. దీని వల్ల ప్రభుత్వానికి రూ.5కోట్లు అదనంగా ఖర్చు కానుంది.