Loading...
Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. అందరి గురి 22ఏ పైనే
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. అందరి గురి 22ఏ పైనే

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. అందరి గురి 22ఏ పైనే

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 07, 2026
09:01 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి సభలో పలు అంశాలపై వాడీవేడి చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల ప్రజాపాలనలో సాధించిన విజయాలను ప్రజల ముందుంచేందుకు సిద్ధమవుతోంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అంశాల వారీగా వివరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

వివరాలు 

22ఏ భూములపైనే ప్రధానంగా చర్చ

ఇటీవల రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీసిన 22ఏ భూముల వ్యవహారాన్ని అసెంబ్లీలో ప్రధానంగా ప్రస్తావించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఇదే అంశంపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో.. వారి విమర్శలు, ఆరోపణలకు సమగ్రంగా సమాధానం ఇచ్చేలా అధికారపక్షం సమాచారాన్ని సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రధాన ప్రతిపక్షం భారాసతోపాటు భాజపా కూడా 22ఏ భూముల అంశంపై చర్చకు డిమాండ్‌ చేస్తున్నాయి.

దీంతో అవసరమైతే ఈ వ్యవహారంపైనే రెండు రోజుల పాటు చర్చ నిర్వహించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో వైఫల్యాలనే ప్రధాన అజెండాగా తీసుకుని భారాస, భాజపా సభలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి.

వివరాలు 

దుద్దిళ్ల శ్రీపాదరావు పేరుతో సెంట్రల్‌ హాల్

తొలిరోజు సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు కొత్తగా నిర్మించిన'సెంట్రల్‌ హాల్‌'ను సీఎం రేవంత్‌రెడ్డి ఉదయం 9 గంటలకు ప్రారంభించనున్నారు.

ఈ హాల్‌కు మాజీ స్పీకర్,దివంగత నేత దుద్దిళ్ల శ్రీపాదరావు పేరు పెట్టారు.

ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి.

తొలిరోజు ఇరుసభల్లోనూ ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించనున్నారు.

'తెలంగాణ సమగ్ర శిక్షణ','పీఎం స్కూల్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా','మెట్రో రైలు'కు సంబంధించిన ఆడిట్‌ నివేదికలను సభ ముందుంచుతారు.

ఆ తర్వాత ఉభయసభలు వాయిదా పడతాయి.అనంతరం శాసనసభ, శాసనమండలికి విడివిడిగా బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశాలు నిర్వహిస్తారు.

సభను ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలను చర్చకు తీసుకోవాలి? అనే విషయాలపై బీఏసీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటారు.

ADVERTISEMENT

వివరాలు 

4 నుంచి 6 రోజులు.. అవసరమైతే పొడిగింపు

ప్రస్తుత పరిస్థితులను బట్టి శాసనసభ, మండలి సమావేశాలు సుమారు 4 నుంచి 6 రోజుల పాటు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

చర్చించాల్సిన అంశాల ప్రాధాన్యం, సభ్యుల నుంచి వచ్చే డిమాండ్లను బట్టి సమావేశాల వ్యవధిని మరింత పెంచే అవకాశమూ ఉంటుంది.

నేడు సీఎల్పీ సమావేశం

అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల విమర్శలను వాస్తవాలు, గణాంకాలు, సమగ్ర సమాచారంతో ఎదుర్కోవాలని అధికార కాంగ్రెస్‌ నిర్ణయించింది.

ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సభా వేదికగా సమాధానం ఇవ్వాలని పార్టీ భావిస్తోంది.

సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహించే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం

ADVERTISEMENT

వివరాలు 

భారాస పాలనలోనే 22ఏ వ్యవహారం: కాంగ్రెస్

22ఏ భూముల అంశంపై అసత్య ప్రచారం ఎక్కువగా జరుగుతోందని, ఈ వ్యవహారం భారాస ప్రభుత్వ హయాంలోనే ఉందనే విషయాన్ని ఆధారాలతో సహా సభలో వివరించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది.

దీనికి సంబంధించి అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, వాటి ద్వారా ప్రజలకు కలిగిన ప్రయోజనాలు, నిధుల వినియోగం, ప్రభుత్వం సాధించిన విజయాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలను పార్టీ, రాజకీయ అనుబంధాలతో సంబంధం లేకుండా అర్హులైన పేదలకు నేరుగా అందిస్తున్న తీరును ప్రధానంగా ప్రస్తావించాలని కాంగ్రెస్‌ వ్యూహరచన చేస్తోంది.

వివరాలు 

'అన్ని వర్గాలకూ మోసం' నినాదంతో భారాస

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయినా అన్ని వర్గాల ప్రజలకు అన్యాయమే జరిగిందని భారాస ఆరోపిస్తోంది.

విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, దళితులు, గిరిజనులు, బీసీలను ప్రభుత్వం మోసం చేసిందనే అంశాన్ని అసెంబ్లీ, శాసనమండలిలో బలంగా వినిపించాలని నిర్ణయించింది.

ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించేందుకు కనీసం నెల రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని భారాస డిమాండ్‌ చేయనుంది.

సాగునీటి ప్రాజెక్టులు, 22ఏ భూముల నిషేధం, నిరుద్యోగులు, విద్యార్థులకు సంబంధించిన సమస్యలను సభలో ప్రస్తావించేందుకు ఆ పార్టీ సభ్యులు సిద్ధమవుతున్నారు.

వివరాలు 

నిషేధిత భూములు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై భాజపా పోరు

నిషేధిత భూములు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సహా పలు సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని భాజపా శాసనసభాపక్షం నిర్ణయించింది.

22ఏ జాబితాలో భూములు చేరడంతో రైతులు, సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ పార్టీ ఆరోపిస్తోంది.

అదే విధంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సక్రమంగా అందకపోవడంతో వారు, వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని భాజపా చెబుతోంది.

ఆరు గ్యారంటీల అమలులోనూ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ.. ఈ అంశాలపై సభలో ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించింది.

కనీసం 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భాజపా సభ్యులు డిమాండ్‌ చేయనున్నారు.

ADVERTISEMENT