Telangana: రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య వాడీవేడీ రాజకీయాలు
ఈ వార్తాకథనం ఏంటి
నదీ జలాల అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ వాతావరణం రోజు రోజుకీ మరింత వేడెక్కుతోంది. ఈ వ్యవహారంలో స్వయంగా ప్రతిపక్ష నేత కె.చంద్రశేఖర్ రావు కూడా ప్రత్యక్షంగా రంగంలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించే దిశగా బీఆర్ఎస్ కసరత్తు చేస్తుండటంతో, సోమవారం ప్రారంభం కానున్న తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు హాట్ హాట్‌గా సాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీటి హక్కుల పరిరక్షణ పేరుతో ఇటీవల బీఆర్ఎస్ ఆందోళనలకు సిద్ధమవుతామని ప్రకటించగా, దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలోనే చర్చ చేద్దామని సవాల్ విసిరింది. ఈనేపథ్యంలో రాబోయే శాసనసభ సమావేశాల్లో ప్రధానంగా నదీ జలాల అంశమే కీలకంగా మారే సూచనలు ఉన్నాయి.
Details
పలు అంశాలపై కీలక చర్చ
గత రెండేళ్లుగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ అంశంపై స్పందించిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వంపై అవసరమైన ఒత్తిడి తేవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఇక నుంచి లెక్క తేలుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వ "తోలు తీస్తాం" అంటూ హెచ్చరికలు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యల అనంతరం అధికార పార్టీ నుంచి ఘాటైన ప్రతిస్పందన వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు అందరూ కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణకు ఎక్కువ ద్రోహం చేసింది బీఆర్ఎస్ పార్టీయేనని సీఎం ఆరోపించారు.
Details
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విస్తృత చర్చ జరిగే అవకాశం
దమ్ముంటే కేసీఆర్ శాసనసభ సమావేశాలకు హాజరై చర్చ చేయాలని సవాల్ విసిరారు. ఆధారాలతో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా స్పష్టం చేశారు. ఇక బీఆర్ఎస్ శాసనసభలో నీటి హక్కుల అంశంతో పాటు మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, కల్యాణలక్ష్మి, యూరియా కొరత వంటి సమస్యలను లేవనెత్తేందుకు సిద్ధమవుతోంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కూడా సభలో విస్తృత చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే, ఈ శీతాకాల సమావేశాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరోసారి తీవ్రస్థాయిలో జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి