Page Loader
Telangana Assembly Special Session : తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు.. కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు.. కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ

Telangana Assembly Special Session : తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు.. కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 04, 2025
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శాసనసభ సమావేశాలకు సిద్ధమవుతోంది. ఈ సమావేశాల్లో ప్రధానంగా బీసీ కులగణన సర్వే నివేదిక, ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్‌ను చర్చించనుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలనుకుంటున్న నేపథ్యంలో, రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీ తీర్మానం తెలంగాణ సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు కట్టుబడి ఉంది. అయితే, ఇందుకు పార్లమెంటులో చట్టసవరణ అవసరమని ప్రభుత్వం స్పష్టం చేయనుంది. ఈ అంశాన్ని అసెంబ్లీ తీర్మానంగా ఆమోదించి కేంద్రానికి పంపనుంది. బీఆర్ఎస్, బీజేపీ సభ్యులను చర్చలో భాగస్వామ్యం చేయడంతో పాటు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే చట్టసవరణ చేయాలని కేంద్రాన్ని కోరనుంది. పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 11 వరకు కొనసాగనున్నాయి.

Details

 కులగణన సర్వే - నివేదిక సమర్పణ 

తెలంగాణ ప్రభుత్వం 2023 ఫిబ్రవరి 4న కులగణన నిర్వహించాలనే నిర్ణయం తీసుకుంది. ఈ నెల 2న ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా క్యాబినెట్ సబ్ కమిటీకి కులగణన నివేదిక అందజేశారు. ఇందులో కులాల వారీగా జనాభా శాతం వివరాలు పొందుపరిచారు. అసెంబ్లీ సమావేశానికి ఒక గంట ముందు క్యాబినెట్ ముందు సబ్ కమిటీ ఈ నివేదికను ప్రవేశపెట్టనుంది.

Details

ఎస్సీ వర్గీకరణపై కీలక చర్చ 

ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదికను క్యాబినెట్ ఆమోదించి అసెంబ్లీలో చర్చకు పెడుతుంది. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సిఫారసుల మేరకు ఏకసభ్య కమిషన్ నియమించారు. ఈ కమిషన్ ఎస్సీ వర్గీకరణలో తలెత్తే సమస్యలు, పరిష్కార మార్గాలపై నివేదిక అందించింది. ఈ నివేదికను అసెంబ్లీలో ప్రస్తావించనున్నారు.

Details

బీసీ రిజర్వేషన్ల పెంపుపై సవాళ్లు 

ఎస్సీ వర్గీకరణ అంశంలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కొన్ని సవాళ్లు ఎదురుకానున్నాయి. ప్రస్తుత 50% రిజర్వేషన్ పరిమితి కారణంగా, అదనపు రిజర్వేషన్లు కల్పించాలంటే కేంద్రం చట్టసవరణ అవసరం. తమిళనాడు ప్రభుత్వం 50శాతం మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్న విధానాన్ని తెలంగాణ కూడా అనుసరించాలని భావిస్తోంది.

Details

న్యాయపరమైన చిక్కులు నివారించేందుకు లీగల్ ఎక్స్‌పర్ట్స్‌తో చర్చ 

ఈ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియలో ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రభుత్వం లీగల్ ఎక్స్‌పర్ట్స్‌తో మంతనాలు జరుపుతోంది. ఈ చర్చల ఆధారంగా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఇక ఎస్సీ వర్గీకరణపై కమిషన్ ఇచ్చిన నివేదికకు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ కీలక అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారనున్నాయి.