Telangana: తెలంగాణలో ఆటో,క్యాబ్ సమ్మెకు బ్రేక్.. ప్రభుత్వంతో చర్చలు సఫలం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు చేపట్టాలనుకున్న నిరవధిక సమ్మె విరమించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రయాణికులకు ఊరట లభించింది. ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, క్యాబ్‌లు, స్కూల్ వ్యాన్‌లను నిలిపివేయాలని కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి యూనియన్ నాయకులను చర్చలకు ఆహ్వానించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో డ్రైవర్ల సమస్యలు, డిమాండ్లపై విస్తృతంగా చర్చించారు.
వివరాలు
ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు
ప్రధానంగా ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.
అలాగే ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరాయి.
చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను కూడా పరిష్కరించాలని యూనియన్ నేతలు ప్రభుత్వాన్ని కోరారు.
కార్మిక సంఘాల డిమాండ్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించిందని సమాచారం.
ముఖ్యంగా ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడానికి మంత్రి అంగీకరించినట్లు తెలిసింది.
వివరాలు
ప్రయాణికులకు తప్పిన రవాణా కష్టాలు
ప్రభుత్వం ఇచ్చిన హామీలపై సంతృప్తి చెందిన యూనియన్ నేతలు సమ్మెను విరమించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
దీంతో అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్‌లు, స్కూల్ వ్యాన్‌లు నిలిచిపోతాయన్న ఆందోళనకు తెరపడింది.
యథావిధిగా ఆటోలు, క్యాబ్‌లు, ఇతర ప్రైవేట్ వాహనాలు రోడ్డెక్కనున్నాయి. దీంతో ప్రయాణికులకు ఎదురయ్యే రవాణా ఇబ్బందులు తప్పినట్టయింది.