Telangana: తెలంగాణ బడ్జెట్ 2026-27: రూ.3.30 లక్షల కోట్ల బడ్జెట్… సంక్షేమ పథకాలకే పెద్దపీట
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టబోయే కొత్త బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధి పథకాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలకు రూ.లక్ష కోట్లకుపైగా కేటాయింపులు ఉండే అవకాశం ఉందని అంచనా. బడ్జెట్‌ను శాసనసభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం బడ్జెట్ పరిమాణం సుమారు రూ.3.30 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. గత ఏడాది రూ.3,04,965 కోట్లుగా ప్రతిపాదించిన బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి దాదాపు 8-10 శాతం పెరుగుదలతో రూ.3.29 నుంచి రూ.3.30 లక్షల కోట్ల వరకు ఉండేలా ప్రభుత్వం రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం.
వివరాలు
మూలధన వ్యయం పెంపు దిశగా అడుగులు
అభివృద్ధి ప్రాజెక్టులకు కీలకమైన మూలధన వ్యయాన్ని ప్రభుత్వం ఈసారి గణనీయంగా పెంచే అవకాశం కనిపిస్తోంది. గత బడ్జెట్‌లో రూ.36,504 కోట్లుగా ఉన్న ఈ కేటాయింపును ఈసారి రూ.45 వేల కోట్ల వరకు పెంచాలని భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో కూడా మొదట కేటాయించిన దానికంటే ఎక్కువగా ఖర్చు చేసిన ఉదాహరణ ఉంది. ఏప్రిల్ 2025 నుంచి జనవరి 2026 వరకు రూ.44,376 కోట్లకుపైగా విడుదల చేయడం ద్వారా అభివృద్ధి పనులపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐలు కూడా మూలధన వ్యయం పెంచాలని రాష్ట్రాలకు సూచిస్తున్నాయి.
వివరాలు
ఇందిరమ్మ ఇళ్లు, సాగునీటి ప్రాజెక్టులకు భారీ నిధులు
త్వరలో చేపట్టబోయే ఇందిరమ్మ ఇళ్ల పథకం, సాగునీటి ప్రాజెక్టులు, యంగ్ ఇండియా స్కూల్స్ వంటి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు అవసరం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సుమారు రూ.29 వేల కోట్లు అవసరమని గృహనిర్మాణ శాఖ అంచనా వేసింది. గతంలో రూ.12,571 కోట్లు కేటాయించగా, ఈసారి ఆ మొత్తాన్ని రూ.17 వేల కోట్ల వరకు పెంచే అవకాశముంది. ఇక నీటిపారుదల శాఖ రూ.26 వేల కోట్ల కేటాయింపులు కోరినా, అందులో సుమారు రూ.11,800 కోట్లే ప్రాజెక్టుల పనులకు వినియోగం అయ్యే అవకాశం ఉంది. మిగతా నిధులు పాత రుణాలు, ఇతర ఖర్చులకు వెళ్లనున్నాయి.
వివరాలు
విద్యుత్ సబ్సిడీలు, రైతు సంక్షేమానికి భారీ వ్యయం
సంక్షేమ రంగంలో భాగంగా ప్రభుత్వం విద్యుత్, వ్యవసాయ రంగాలకు భారీగా ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలో 30 లక్షల వ్యవసాయ బోర్లకు, 50 లక్షల గృహజ్యోతి ఇళ్లకు ఉచిత విద్యుత్ అందించేందుకు డిస్కంలు రూ.20 వేల కోట్లు అవసరమని కోరాయి. గత బడ్జెట్‌లో రూ.14 వేల కోట్లు కేటాయించినా సరిపోలలేదు. రైతుభరోసా, రైతుబీమా, వ్యవసాయ యాంత్రీకరణ వంటి పథకాల కోసం ఈసారి రూ.20 వేల కోట్ల వరకు కేటాయించే ప్రతిపాదనలు ఉన్నాయి.
వివరాలు
సామాజిక సంక్షేమానికి పెరిగే కేటాయింపులు
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా-శిశు సంక్షేమ శాఖల కోసం గత బడ్జెట్‌లో రూ.72,396 కోట్లు కేటాయించగా, ఈసారి 7-8 శాతం పెంపుతో దాదాపు రూ.77 వేల కోట్ల వరకు పెంచాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ రంగాల్లో ఖర్చులు తప్పనిసరి కావడంతో కేటాయింపులు పెరగడం ఖాయం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వివరాలు
జీతాలు, పింఛన్లపై పెరుగుతున్న భారం
కొత్త ఉద్యోగాల భర్తీతో జీతభత్యాల ఖర్చు పెరుగుతోంది. గత బడ్జెట్‌లో రూ.44,478 కోట్లు కేటాయించినా సరిపోలకపోవడంతో ఈసారి రూ.46 వేల కోట్ల వరకు కేటాయించే అవకాశం ఉంది. రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్ల కోసం గతంలో రూ.13,109 కోట్లు కేటాయించినా, ఖర్చు రూ.16 వేల కోట్లకు పైగా వెళ్లింది. వచ్చే ఏడాది సుమారు 8 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనుండటంతో, వారి బెనిఫిట్స్‌కే రూ.10 వేల కోట్లు అవసరం అవుతాయి. ఇక ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రూ.10 వేల కోట్లు ఉండటంతో, మొత్తం కలిపి కనీసం రూ.20 వేల కోట్లు కేటాయించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. అయితే పింఛన్ల కోసం సుమారు రూ.16 వేల కోట్లు కేటాయించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.
వివరాలు
వడ్డీ భారంతో ఒత్తిడి
రాష్ట్రంపై రుణాల భారం కూడా పెరుగుతోంది. గత బడ్జెట్‌లో వడ్డీ చెల్లింపులకు రూ.19,369 కోట్లు కేటాయించినా, చివరికి రూ.25 వేల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈసారి కూడా అదే స్థాయిలో కేటాయింపులు అవసరమయ్యే పరిస్థితి ఉంది. గతంలో రూ.54 వేల కోట్ల రుణాల లక్ష్యాన్ని నిర్ణయించిన ప్రభుత్వం, చివరికి రూ.70 వేల కోట్ల వరకు రుణాలు సేకరించింది. ఈసారి కూడా ఇదే స్థాయిలో రుణాల సేకరణ ఉండే అవకాశం ఉంది. కొత్తగా తీసుకునే రుణాల్లో 70 శాతం వరకు పాత బాకీల చెల్లింపులకే వెళ్తుండటం ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతోంది.