హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేబినెట్ సంచలన నిర్ణయం.. నలుదిశలా కొత్త మార్గాలు ఇవే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగింది. భేటీలో భాగంగా పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. మెట్రో విస్తరణ, టీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, కొత్త విమానశ్రయాల నిర్మాణం లాంటి కీలక విషయాలను మంత్రివర్గం ఆమోదించింది. మెట్రో రైలు విస్తరణపై రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నలుదిక్కులా హైదరాబాద్ మహానగరం రూపురేఖలు మారిపోనున్నాయి. వచ్చే 4 ఏళ్లకు సంబంధించి మెట్రో రైలు నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మొత్తం 9 మార్గాల్లో ఆధునిక ప్రజా రవాణా మార్గం (మెట్రో) నిర్మాణం జరగనున్నట్లు ప్రకటించింది.
మూడో దశలో 12 కొత్త మార్గాలకు మెట్రో
మహానగర భవిష్యత్ నేపథ్యంలో రూ. 69,100 కోట్ల భారీ వ్యయంతో మెట్రో రైలును ఆర్ఆర్ఆర్ వెలుపలికి విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది. తాజాగా మూడో దశలో రూ.69,100 కోట్లతో దాదాపు 278 కి.మీ మేర మెట్రో నిర్మాణానికి తీర్మానించారు. మూడో దశలో 8 మార్గాలతో పాటు ఔటర్ వెంట మరో 4 మార్గాల్లో మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. మూడో దశ మెట్రో విస్తరణలో భాగంగా జేబీఎస్ - తూంకుంట, ప్యాట్నీ - కండ్లకోయ ప్రాంతాల్లో డబుల్ డెక్కర్ (2 అంతస్తుల వంతెనలు) నిర్మించనున్నారు. ఒక వంతెనను మెట్రో రైలుకు, మరోటి వాహనాలకు వినియోగిస్తారు. బీహెచ్ఈఎల్ - పటాన్ చెరు -ఇస్నాపూర్ కారిడార్ 8 స్టేషన్లతో 13 కి.మీ మేర 3,250 కోట్ల అంచనాతో నిర్మించనుంది.
ఉప్పల్-ఘట్ కేసర్-బీబీనగర్ కారిడార్ 10 స్టేషన్లతో నిర్మాణం
ఎల్బీనగర్ - హయత్ నగర్ - పెద్ద అంబర్ పేట కారిడార్‌లో 8 స్టేషన్లతో 13 కిమీ మేర 3,250 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టనున్నారు. శంషాబాద్ జంక్షన్ - కొత్తూరు - షాద్ నగర్ కారిడార్‌లో 6 స్టేషన్లతో 28 కి.మీ మేర 6,800 కోట్ల అంచనా వ్యయం కానుంది. ఉప్పల్-ఘట్ కేసర్-బీబీనగర్ కారిడార్ 10 స్టేషన్లతో 25 కిమీ మేర 6,900 కోట్లతో నిర్మించనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం- తుక్కుగూడ ఓఆర్ఆర్ -మహేశ్వరం ఎక్స్ రోడ్డు - కందుకూర్ కారిడార్‌లో 8 స్టేషన్లతో 26 కి.మీ మేర 6,600 కోట్లు ఖర్చుపెట్టనుంది. తార్నాక - ఈసీఐఎల్ ఎలివేటెడ్ మెట్రో 5 స్టేషన్లతో 8 కిమీ మేర రూ.2,300 కోట్లతో నిర్మించనున్నారు.
ORR పెద్ద అంబర్ పేట - ఘట్‌కేసర్ - శామీర్‌పేట - మేడ్చల్ జంక్షన్ వరకు 5 స్టేషన్లతో నిర్మాణం
మూడో దశ-బి (ఓఆర్ఆర్ మెట్రో కారిడార్) : శంషాబాద్ జంక్షన్ -తుక్కుగూడ - బొంగుళూరు - పెద్ద అంబర్‌పేట్ జంక్షన్‌లో 5 స్టేషన్లతో 40 కి.మీ మేర రూ.5,600 కోట్లతో ఏర్పాటు చేయనుంది. ORR పెద్ద అంబర్ పేట - ఘట్‌కేసర్ - శామీర్‌పేట - మేడ్చల్ జంక్షన్ వరకు 5 స్టేషన్లతో 45 కి.మీ మేర రూ. 6,750 కోట్ల అంచనా. ORR మేడ్చల్ - దుండిగల్ - పటాన్ చెరు వరకు 3 స్టేషన్లు 29 కిమీ మేర అంచనా వ్యయం రూ.4,785 కోట్లు. ORR పటాన్ చెరు - కోకాపేట - నార్సింగి జంక్షన్ వరకు 3 స్టేషన్లు, 22 కిమీ అంచనా వ్యయం రూ. 3,675 కోట్లు.
రెండు ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ కారిడార్ల నిర్మాణం
బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకపూల్ వరకు 3 మెట్రో స్టేషన్లు, 26 కి.మీ అంచనా వ్యయం రూ. 9,100 కోట్లతో నిర్మాణం చేయనున్నారు. మూడో దశ-సీ (ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ కారిడార్) : జేబీఎస్ (JBS) - తూంకుంట మార్గంలో 13 మెట్రో స్టేషన్లు, 17 కి.మీ మేర అంచనా వ్యయం రూ.5,690 కోట్లు. ప్యారడైజ్ జంక్షన్ - కొంపల్లి - కండ్లకోయ 10 మెట్రో స్టేషన్లతో 12 కి.మీ మేర అంచనా వ్యయం రూ. 4,400 కోట్లు. ఇక ఐటీ కారిడార్ పరిధిలోని రాయదుర్గం - శంషాబాద్ విమానాశ్రయం 9 మెట్రో స్టేషన్లు, 31 కి.మీ మేర అంచనా వ్యయం రూ.6,250 కోట్లుగా ప్రభుత్వం వెల్లడించింది.