TREIRB: రేపటి నుంచి గురుకుల ఉద్యోగ నియామక పరీక్షలు; బూట్లతో వస్తే నో ఎంట్రీ
తెలంగాణలోని గురుకులాల్లో పోస్టుల భర్తీకి మంగళవారం(ఆగస్టు1) నుంచి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TREIRB) రాత పరీక్షలు నిర్వహిస్తోంది. కంప్యూటర్ ఆధారంగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 1నుంచి 23వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు మొత్తం 104 కేంద్రాలను ఎంపిక చేశారు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ)కి సంబంధించిన మొత్తం 9210 పోస్టులను ఈ పరీక్షల ద్వారా భర్తీ చేయన్నారు. ఇప్పటికే బోర్టు ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను https://treirb.telangana.gov.in/ లో అందులో ఉంచారు.
నియమ-నిబంధనలు ఇవే
పరీక్ష రాసే అభ్యర్థుల నిర్ణీత సమయం కంటే ముందే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాల్సి ఉంటుంది. ముందు చేరుకున్న వారికే బయోమెట్రిక్ తీసుకుంటారు. పరీక్ష కేంద్రం వద్దకు పావుగంట ముందుగానే చేరుకోవాలి. లేకుంటే గేట్లు మూసేస్తారు. ఒకసారి పరీక్ష కేంద్రంలోకి వెళ్లాక, ఎగ్జామ్ ముగిసిన తర్వాతే బయటకు రావాల్సి ఉంటుంది. ఈ పరీక్షను బోర్డు 19రోజుల పాటు నిర్వహిస్తోంది. మొత్తం మూడు షిఫ్టుల్లో(ఉదయం 8.30-10.30, మధ్యాహ్నం 12.30-2.30, సాయంత్రం 4.30-6.30 గంటల వరకు) పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌తో పాటు గుర్తింపు కారును కూడా వెంట తెచ్చుకోవాలి. అభ్యర్థుల చెప్పులు మాత్రమే ధరించాలి. బూట్లు ధరించిన వారికి పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదు. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్ష హాలులోకి తీసుకురావొద్దు.