LOADING...
TG Cabinet Meeting: 2028 జూన్‌ నాటికి ఎస్సెల్బీసీ టన్నెల్‌ పూర్తి.. క్యాబినెట్‌ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పొంగులేటి 
క్యాబినెట్‌ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పొంగులేటి

TG Cabinet Meeting: 2028 జూన్‌ నాటికి ఎస్సెల్బీసీ టన్నెల్‌ పూర్తి.. క్యాబినెట్‌ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పొంగులేటి 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2025
09:38 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలను సుదీర్ఘంగా చర్చించింది. బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే హైకోర్టు మధ్యంతర తీర్పులు, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో,న్యాయ నిపుణుల సలహాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ముందుకు వెళ్లాలని క్యాబినెట్ నిర్ణయించింది. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం వచ్చే నెల 3న హైకోర్టులో విచారణకు రాబోతున్నందున, ఆ రోజున వెలువడే ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించారు. తదుపరి, వచ్చే నెల 7న మంత్రివర్గం మరోసారి సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పర్యటన కారణంగా హాజరు కాలేకపోయారు.

వివరాలు 

ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేస్తూ ఆర్డినెన్స్‌ 

సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎంపీ బలరాం నాయక్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరులకు వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికి అనుగుణంగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్‌ 21(3)ని తొలగించే విధంగా ఆర్డినెన్స్ ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది. అసెంబ్లీ ప్రొరోగ్‌ అయినందున, చట్ట సవరణకు గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్ జారీ చేయాల్సి ఉంది.

వివరాలు 

టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ కాకుండా.. 

ప్రపంచంలోనే పొడవైన ఎస్సెల్బీసీ సొరంగం పనులను పునరుద్ధరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మిగిలిన సొరంగం భాగాన్ని అత్యాధునిక డ్రిల్లింగ్ పద్ధతులతో పూర్తి చేయాలని, గ్రావిటీ ద్వారా 3.50 లక్షల ఎకరాలకు నీటిని అందిస్తూ,నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించేందుకు ఈ ప్రాజెక్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లో పూర్తిచేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు సొరంగం తవ్వకానికి ఉపయోగించిన టన్నెల్ బోరింగ్ మిషన్ కాకుండా,అధునాతన డ్రిల్లింగ్ పద్ధతులను అనుసరించేందుకు కాంట్రాక్టు ఏజెన్సీని ఆమోదించారు. మొత్తం 44 కిలోమీటర్ల సొరంగంలో 35 కిలోమీటర్లు పూర్తయినప్పటికీ, ఫిబ్రవరి 22న జరిగిన ప్రమాదం వల్ల పనులు నిలిచిపోయాయి. మిగిలిన 9 కిలోమీటర్ల సొరంగం తవ్వకంలో అడవులు,పర్యావరణం,వన్యప్రాణులకు ఎలాంటి హాని కలగకుండా అత్యాధునిక సాంకేతిక పద్ధతులు ఉపయోగించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

వివరాలు 

యుద్ధప్రాతిపదికన 4 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు 

ఈ సొరంగం 2028 జూన్ నాటికి పూర్తి చేయాలని గడువు పెట్టారు. వరంగల్ సూపర్‌ స్పెషాలిటీ,ఎల్బీనగర్ టిమ్స్, సనత్‌నగర్ టిమ్స్,అల్వాల్ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయమని మంత్రిమండలి అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో 1,500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదనలకు క్యాబినెట్ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. నిర్మాణ ప్రాంతాల నిర్ణయం విద్యుత్ శాఖ తీసుకోవాలని సూచించారు. రామగుండంలో 52 ఏళ్ల క్రితం ప్రారంభమైన రామగుండం థర్మల్‌ స్టేషన్ (ఆర్‌టీఎస్‌-బి, 62.5 మెగావాట్ల యూనిట్)కాలపరిమితి ముగిసినందున,దాన్ని తొలగించమని మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్రంలో ప్రస్తుతం,రాబోయే 10 సంవత్సరాల విద్యుత్ డిమాండ్‌ అంచనాలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తు ప్రణాళిక రూపొందించాలని, అవసరమైన విద్యుత్ ఉత్పత్తి వ్యూహాలను నివేదించాలని విద్యుత్ శాఖను మంత్రివర్గం ఆదేశించింది.

వివరాలు 

అది టీకప్పులో తుపాను లాంటిది: కొండా సురేఖ 

యాదాద్రి పవర్ ప్లాంట్‌లో బూడిద హ్యాండిలింగ్‌కు రైల్వే ట్రాక్ నిర్మాణానికి రూ.540 కోట్ల వ్యయానికి మంజూరు ఇచ్చారు. ''మాది అంతా కాంగ్రెస్‌ కుటుంబం. సాధారణ కుటుంబాల్లో చిన్న గొడవలు వచ్చినట్లుగా, తప్పుగా అర్థం చేసుకోవడంతో మా పార్టీలోనూ గొడవలు వచ్చాయి. ఇది టీకప్పులో తుపానులాంటిది. సమస్యను అర్థం చేసుకుని, క్షమాపణలు చెప్పి ముందుకు వెళ్తున్నాం. కేటీఆర్‌ తొలుత తన చెల్లిని దగ్గరకు తీసుకుని.. ప్రేమగా చూసుకోవడం నేర్చుకోవాలి'' అని మంత్రి కొండా సురేఖ విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా స్పందించారు.

వివరాలు 

పంచాయతీ, పురపాలికల్లో 'ఇద్దరు పిల్లల' నిబంధన ఎత్తివేత 

ఇప్పటి వరకు రెండు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వ్యక్తులు గ్రామ పంచాయతీ,ఎంపీటీసీ,జడ్పీటీసీ, నగరపాలక సంస్థలు,పురపాలికల ఎన్నికల్లో పోటీ చేయలేకపోయేవారు. ఈ నిబంధనను తొలగిస్తూ పంచాయతీరాజ్ చట్టం 2018,పురపాలక చట్టాలు 2019లో సవరణలతో ఆర్డినెన్స్ జారీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గత డిసెంబరులో మంత్రివర్గం సమావేశంలో ఈప్రతిపాదన చర్చలోకి రాగా,పంచాయతీరాజ్ శాఖ తగిన ఆధారాలు సమర్పించకపోవడం వలన ఆమోదం పొందలేదు. ఆతరువాత,శాస్త్రీయ ఆధారాలతో రాష్ట్ర అధికారులు వివిధ రాష్ట్రాల విధానాలను పరిశీలించి, సంతానోత్పత్తి రేటు తగ్గిన నేపథ్యంలో రెండు పిల్లల పరిమితి సమంజసం కాదని,నిబంధనను రద్దు చేయాలని మంత్రివర్గానికి నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగా,'ఇద్దరు పిల్లల'నిబంధనను ఎత్తివేయడం కోసం ఆర్డినెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కి పంపింది.ఆమోదం పొందగానే వెంటనే అమలు అవుతుంది.