Telangana Revenue Growth: తెలంగాణ ఖజానాకు భారీ ఆదాయం.. ఒక్క నెలలో రూ.7,735 కోట్ల రాబడి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ఖజానాకు కాసుల వర్షం కురుస్తోంది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ భారీగా ఆదాయాన్ని సమకూరుస్తూ రికార్డు సృష్టించింది. జీఎస్టీ (GST), వ్యాట్ (VAT), ప్రొఫెషనల్ ట్యాక్స్ వసూళ్లలో గణనీయమైన వృద్ధి నమోదైంది. 2026 అక్టోబర్ నెలలోనే ప్రభుత్వానికి ఏకంగా రూ.7,735కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాది ఇదే నెలలో వచ్చిన రూ.6,332 కోట్లతో పోలిస్తే 22.16శాతం వృద్ధి నమోదైంది. అక్టోబర్ నెలలో వచ్చిన మొత్తం ఆదాయంలో జీఎస్టీ వాటా ఎక్కువగా ఉంది. ఈ పన్ను ద్వారా రూ.4,590 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరాయి. వ్యాట్ రూపంలో రూ.3,065 కోట్లు, ప్రొఫెషనల్ ట్యాక్స్ ద్వారా మరో రూ.80కోట్లు వచ్చాయి. దీంతో ఒకే నెలలో వాణిజ్య పన్నుల శాఖ రికార్డు స్థాయి ఆదాయాన్ని సాధించింది.
వివరాలు
ఏడు నెలల్లో రూ.52,110 కోట్ల ఆదాయం
2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఏడు నెలల కాలంలో తెలంగాణ ప్రభుత్వానికి పన్నుల రూపంలో మొత్తం రూ.52,110కోట్ల ఆదాయం లభించింది.
గత ఏడాది ఇదే సమయంలో వచ్చిన రూ.44,598కోట్లతో పోలిస్తే ఈసారి 16.85శాతం వృద్ధి నమోదైంది.
ఈ ఏడు నెలల్లో జీఎస్టీ ద్వారా రూ.29,627కోట్ల ఆదాయం సమకూరింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఈ పన్ను ద్వారా రూ.52,490కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇప్పటివరకు ఆ లక్ష్యంలో 56.44శాతం సాధించింది.
అదేవిధంగా వ్యాట్, సేల్స్ ట్యాక్స్ ద్వారా ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు రూ.21,893కోట్లు వచ్చాయి.
ఈ పన్నుల ద్వారా వార్షికంగా రూ.38,106 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా, ఇప్పటికే 57.45 శాతం ఆదాయాన్ని సమకూర్చుకుంది.
వివరాలు
మిగిలిన ఐదు నెలల వసూళ్లపైనే ఆశలు
వాణిజ్య పన్నుల శాఖ ఆదాయంలో నమోదవుతున్న ఈ వృద్ధి రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఊరటనిస్తోంది.
ఇదే జోరు రాబోయే ఐదు నెలల్లోనూ కొనసాగితే 2026-27 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న ఆదాయ లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పన్నుల రూపంలో వచ్చే ఆదాయం రాష్ట్ర ఆర్థిక నిర్వహణలో కీలక పాత్ర పోషించనుంది.
ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.
దీంతో మిగిలిన ఐదు నెలల్లోనూ పన్నుల వసూళ్లను ఇదే స్థాయిలో కొనసాగించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.