Telangana: తెలంగాణలో తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో రాబోయే రోజుల్లో వాతావరణం మారనుంది. తుఫాన్ 'అర్నబ్' ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా అక్టోబర్ 28 నుంచి వర్షాల తీవ్రత పెరిగే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అక్టోబర్ 27 ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలోని ఒకట్రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎలాంటి వాతావరణ హెచ్చరికలు జారీ చేయలేదు.
వివరాలు
ఈదురుగాలులు వీచే అవకాశం
అక్టోబర్ 27 ఉదయం 8.30 గంటల నుంచి అక్టోబర్ 28 ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు.
ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
వివరాలు
ఈ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్
అక్టోబర్ 28 ఉదయం 8.30 గంటల నుంచి అక్టోబర్ 29 ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉండటంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, సూర్యాపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
వివరాలు
అక్టోబర్ 29, 30 తేదీల్లోనూ వర్షాలు
ఇదే సమయంలో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షాలు, బలమైన గాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అక్టోబర్ 29 ఉదయం 10 గంటల నుంచి అక్టోబర్ 30 ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
వివరాలు
నవంబర్ 1 వరకు వాతావరణ పరిస్థితులు
అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్,జగిత్యాల,రాజన్న సిరిసిల్ల,కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి,రంగారెడ్డి,వికారాబాద్ తదితర జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
అక్టోబర్ 30 ఉదయం 8.30 గంటల నుంచి నవంబర్ 1 ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలోని అక్కడక్కడ మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ రెండు రోజులకు వాతావరణ శాఖ ప్రత్యేక హెచ్చరికలేవీ జారీ చేయలేదు.
మొత్తంగా అక్టోబర్ 28 నుంచి 30 వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ముఖ్యంగా రెడ్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల ప్రజలు వాతావరణ శాఖ సూచనలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి.