Telangana: లిఫ్ట్ ప్రమాదాల నివారణకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త బిల్లు సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో తరచూ జరుగుతున్న లిఫ్ట్ ప్రమాదాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమైంది. లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, మూవింగ్ వాక్స్ భద్రతను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 'తెలంగాణ లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, మూవింగ్ వాక్స్ ముసాయిదా బిల్లు'ను రూపొందించింది. ఈ ముసాయిదాకు గత నెల 25న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. ప్రస్తుతం బిల్లు న్యాయశాఖ పరిశీలనలో ఉండగా, అనంతరం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం కోసం తీసుకురానున్నారు. రాష్ట్రంలో లిఫ్ట్‌లలో తలెత్తుతున్న సాంకేతిక లోపాలు, నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొంటూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది. దీనిపై ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌లో కొత్త చట్టానికి సంబంధించిన ముఖ్యాంశాలను వెల్లడించింది.
వివరాలు
కొత్త చట్టంతో ఇవి తప్పనిసరి
ప్రతిపాదిత చట్టం అమల్లోకి వస్తే లిఫ్ట్‌లు తయారు చేసే కంపెనీలు ప్రభుత్వంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
అలాగే భవనాలు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాలు, ఇళ్లలో ఏర్పాటు చేసే ప్రతి లిఫ్ట్, ఎస్కలేటర్, మూవింగ్ వాక్ భారతీయ ప్రమాణాల సంస్థ (బీఎస్‌ఐ) నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి.
ప్రభుత్వం నియమించే ఇన్‌స్పెక్టర్లు ప్రతి ఏడాది లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, మూవింగ్ వాక్స్‌ను తనిఖీ చేసి వాటి భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తారు.
సాంకేతికంగా గుర్తింపు పొందిన నిపుణులు లేదా అధీకృత సంస్థల ద్వారానే వాటి నిర్వహణ, మరమ్మతులు చేపట్టేలా ప్రత్యేక నిబంధనలు అమలు చేయనున్నారు.
వివరాలు
నాణ్యత లేకపోతే కంపెనీలపై చర్యలు
లిఫ్ట్ తయారీలో నాణ్యత లోపాలు ఉన్నట్లు తేలితే సంబంధిత కంపెనీలపై వినియోగదారుల ఫోరంలో కేసులు నమోదు చేసే అవకాశాన్ని కూడా కొత్త చట్టం కల్పించనుంది.
దీంతో తయారీ సంస్థలు భద్రతా ప్రమాణాల విషయంలో మరింత బాధ్యతగా వ్యవహరించే పరిస్థితి ఏర్పడనుంది.
ఈ చట్టాన్ని తీసుకురావడాన్ని తెలంగాణ ఎలివేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అవినాష్ చల్లా స్వాగతించారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి బిల్లు సిద్ధమైందని ఆయన తెలిపారు.
లిఫ్ట్‌లను అత్యవసర సేవలుగా గుర్తించి, ప్రస్తుతం అమల్లో ఉన్న 18 శాతం జీఎస్టీని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
దీంతో లిఫ్ట్‌ల ఏర్పాటు, నిర్వహణ వ్యయాలు తగ్గి భద్రతా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు.