Telangana elections 2023:తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. ఇవాళ ఎవరెవరు నామినేషన్ వేశారంటే
తెలంగాణలో ఎన్నికల సమరం జోరందుకుంది.ఈ క్రమంలోనే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులంతా పెద్ద ఎత్తున ఇవాళ నామపత్రాలను దాఖలు చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ ఇవాళ రెండు చోట్ల నామినేషన్లు దాఖలు చేశారు. తొలుత గజ్వేల్, తర్వాత కామారెడ్డిలోనూ నామినేషన్ వేశారు. మంత్రులు హరీశ్‌రావు,కేటీఆర్ సైతం నామినేషన్లు దాఖలు చేశారు.సిద్దిపేటలోని ఆర్డీవో కార్యాలయంలో హరీశ్‌రావు, సిరిసిల్ల ఆర్డీవో ఆఫీస్‌లో కేటీఆర్ నామపత్రాలను దాఖలు చేశారు. బోధన్ అభ్యర్థి షకీల్ నామినేషన్ ప్రక్రియలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ట్రాఫిక్ రద్దీతో ద్విచక్రవాహనంపై వెళ్లారు. దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి వీల్ ఛైర్ లో వచ్చి నామినేషన్ వేశారు.ఇక నగరంలో మంత్రి తలసాని, ముషీరాబాద్ లో ముఠా గోపాల్ నామపత్రాలను సమర్పించారు.
హైదరాబాద్ నగరంలో నామపత్రాల పర్వం
మరోవైపు బీజేపీ తరఫున హుజురాబాద్ అభ్యర్థిత్వం కోసం ఈటల రాజేందర్ నామపత్రాలు దాఖలు చేశారు. ఇదే సమయంలో హైదరాబాద్ మహానగరంలో ముషీరాబాద్ అభ్యర్థిగా పూస రాజు గంగపుత్ర, అంబర్ పేటలో మాజీ మంత్రి కృష్ణ యాదవ్ నామినేషన్లు వేశారు. ఇక కాంగ్రెస్ పక్షాన మునుగోడులోని చండూరులో రాజగోపాల్ రెడ్డి, పాలేరు అభ్యర్థిగా పొంగులేటి, ఖమ్మంలో తుమ్మల, మధిరలో భట్టి నామినేషన్లు సమర్పించారు. చెన్నూరు కాంగ్రెస్ నుంచి వివేక్, బీఆర్ఎస్ నుంచి బాల్కసుమన్ నామపత్రాలను దాఖలు చేశారు. మంచిర్యాల కాంగ్రెస్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, బీఆర్ఎస్ నుంచి దివాకర్ రావు నామినేషన్ వేశారు. నామినేషన్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంటోంది.ఈ మేరకు 10వ తేదీ, శుక్రవారం గడువుతో రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.