Telangana elections: తెలంగాణ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం.. తొలి రిజల్ట్స్ భద్రాచలం నుంచే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 49కేంద్రాల్లో ఆదివారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ తెలిపారు. కౌంటింగ్‌లో ఉన్న సిబ్బంది, పోటీలో ఉన్న అభ్యర్థుల ఏజెంట్లు రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 5గంటలకే ఆయా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. ఒక్కో నియోజకవర్గానికి 14టేబుళ్లు, పెద్ద నియోజకవర్గం అయితే మరిన్ని కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. 1.80లక్షల మంది పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకుట్లు ఈసీ తెలిపింది. 119అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మొత్తం 2,290మంది అభ్యర్థులు బరిలో ఉండగా అందులో 221మంది మహిళలు ఉన్నారు. తెలంగాణలో 71.34 శాతం పోలింగ్ నమోదైంది.
49 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 49 కౌంటింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాలు, రాష్ట్ర సాయుధ బలగాలు, స్థానిక పోలీసులతో సహా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల కలిపి దాదాపు 40 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసులను మోహరించారు. అన్ని నియోజకవర్గాలకు కలిపి 1798 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 2417 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సిబ్బంది ఓట్లను లెక్కించనున్నారు. ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో 28 చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేశారు.
మధ్యాహ్నం 12 గంటలకు తొలి ఫలితం
మధ్యాహ్నం 12 గంటలకు చిన్న నియోజకవర్గం ఫలితం వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రంలో అతి కౌంటింగ్ ఉన్నది భద్రాచలంలోనే కావడంతో తొలి ఫలితం ఇక్కడి నుంచే వచ్చే అవకాశం ఉంది. అన్ని కేంద్రాల్లో చివరి రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల సిబ్బంది, పోలీసు సిబ్బందిని ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ ప్రత్యేకంగా ఆదేశించారు. తెలంగాణలో అసెంబ్లీకి 119 మంది సభ్యులను ఎన్నుకునేందుకు 3 కోట్ల 26 లక్షల మంది ఓటర్లలో మొత్తం 71.34 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని డీజీపీ వెల్లడించారు.