Telangana: తెలంగాణలో 3 ఐటీఐ హబ్‌లకు గ్రీన్‌సిగ్నల్.. పీఎం-సేతు కింద రూ.757 కోట్ల పెట్టుబడులు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో నైపుణ్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. పీఎం-సేతు పథకం కింద రాష్ట్రంలోని 15 ప్రభుత్వ ఐటీఐలను హబ్ అండ్ స్పోక్ విధానంలో మూడు క్లస్టర్లుగా అభివృద్ధి చేయడానికి కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల కోసం మూడు కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో మొత్తం రూ.757.19 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. పారిశ్రామిక రంగ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడం,యువతకు మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన నాలుగో నేషనల్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఒడిశా,గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల్లోని మొత్తం 25ప్రభుత్వ ఐటీఐలను రూ.1,237 కోట్ల పెట్టుబడులతో అభివృద్ధి చేసే ప్రతిపాదనకు ఆమోదం లభించింది.
వివరాలు
హైదరాబాద్ కేంద్రంగా తొలి క్లస్టర్
మొదటి క్లస్టర్‌లో హైదరాబాద్ పాతనగర ప్రభుత్వ ఐటీఐని హబ్‌గా అభివృద్ధి చేయనున్నారు. అపోలో మెడ్ స్కిల్స్ లిమిటెడ్ భాగస్వామ్యంతో రూ.241.01 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఈ క్లస్టర్‌లో వరంగల్, నల్గొండ (బాలుర), వికారాబాద్ (బాలికల), పంజాగుట్ట ప్రభుత్వ ఐటీఐలు స్పోక్ సంస్థలుగా పనిచేయనున్నాయి. పటాన్‌చెరు కేంద్రంగా రెండో క్లస్టర్ రెండో క్లస్టర్‌కు పటాన్‌చెరు ప్రభుత్వ ఐటీఐ హబ్‌గా ఉండనుంది. శ్రీ సిద్ధార్థ ఇన్‌ఫ్రాటెక్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి రూ.275.24 కోట్ల పెట్టుబడితో ఈ క్లస్టర్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో షాద్‌నగర్, మార్‌పల్లి, నల్గొండ (కొత్త), భువనగిరి ప్రభుత్వ ఐటీఐలు స్పోక్‌లుగా కొనసాగనున్నాయి.
వివరాలు
సంగారెడ్డి కేంద్రంగా మూడో క్లస్టర్
మూడో క్లస్టర్‌ను సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐ కేంద్రంగా ఏర్పాటు చేయనున్నారు. న్యూల్యాండ్ ఫౌండేషన్‌తో కలిసి రూ.240.94 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. ఈ క్లస్టర్‌లో హత్నూర, మెదక్, దుబ్బాక, ఎల్లారెడ్డి ప్రభుత్వ ఐటీఐలు భాగమవుతాయి. తెలంగాణకే అత్యధిక వాటా నాలుగో నేషనల్ స్టీరింగ్ కమిటీ ఆమోదించిన మొత్తం 25 ఐటీఐల్లో తెలంగాణకు 15 ఐటీఐలు దక్కడం విశేషం. అంటే మొత్తం ఆమోదించిన సంస్థల్లో 60 శాతం తెలంగాణలోనే ఉండనున్నాయి. అలాగే మొత్తం పెట్టుబడుల్లో రూ.757.19 కోట్లతో 61.19 శాతం వాటా తెలంగాణకే లభించింది.