
Telangana: తెలంగాణలోని అన్ని దేవాలయాలలో ఆన్‌లైన్ టికెట్ వ్యవస్థ
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల కొమురవెల్లి, బల్కంపేట, బాసర వంటి ప్రముఖ దేవాలయాల్లో టికెట్ల దుర్వినియోగం, అక్రమ విక్రయాలు వెలుగులోకి రావడంతో, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై అన్ని రకాల టికెట్లను ఆన్లైన్ ద్వారా మాత్రమే భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించబడింది.
మాన్యువల్ టికెట్లను పునఃపరిశీలించకుండా, వాటిని దుర్వినియోగం చేయడం, నకిలీ టికెట్ల చలామణి వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలపై ప్రభుత్వం తీవ్రమైన దృష్టి పెట్టింది.
వివరాలు
ఈ నెల 15న మంత్రి సమీక్షా సమావేశం
ఈ అంశంపై ఈ నెల 15వ తేదీన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
ఈ సమీక్ష అనంతరం ఆన్లైన్ టికెట్ల విధానాన్ని అధికారికంగా అమలు చేయడం ప్రారంభం కానుంది.
ఈ వ్యవస్థ ద్వారా భక్తులకు పారదర్శకంగా సేవలు అందించడమే కాకుండా, దేవాలయాల్లో జరిగే ఆదాయ, ఖర్చుల ప్రక్రియపై కఠినంగా పర్యవేక్షణ కొనసాగించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.
మరోవైపు, భక్తులు ఇక టికెట్ల కోసం ఆలయాలకు ప్రయాణించాల్సిన అవసరం లేకుండా, ముందే ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా టికెట్లు పొందే వీలుంటుంది.
వివరాలు
ప్రస్తుత పరిస్థితి - అవకతవకలు వెలుగులోకి
ప్రస్తుతం రాష్ట్రంలోని వేములవాడ, భద్రాచలం, యాదగిరిగుట్ట, బాసర, భద్రకాళి, చెర్వుగట్టు, కొమురవెల్లి తదితర ప్రముఖ ఆలయాల్లో టికెట్ల విక్రయాల్లో అనేక అక్రమాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ముఖ్యంగా వీఐపీ టికెట్ల విక్రయాల్లో తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. రోజూ 200 నుంచి 500 టికెట్లు వరకూ భక్తులకు నిబంధనలు అతిక్రమించి విక్రయించబడుతున్నట్లు సమాచారం.
సాధారణంగా రూ.500కు లభించాల్సిన టికెట్లు, రూ.2,000 నుంచి రూ.5,000 వరకు అమ్ముతూ కొందరు సిబ్బంది, మధ్యవర్తులు భారీగా లాభాలు సంపాదిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వివరాలు
నకిలీ టికెట్లు, రీసైక్లింగ్ దందాలు
గతంలో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో టికెట్ కౌంటర్ సిబ్బంది నకిలీ టికెట్లు ముద్రించి విక్రయించిన సంఘటన కలకలం రేపింది.
ఒక్కరోజే రూ.31,000 విలువైన నకిలీ టికెట్లు విక్రయించి ఆదాయం పొందినట్లు వెలుగులోకి రావడంతో, భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత చెలరేగింది.
అనంతరం ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది.
చెర్వుగట్టు దేవాలయంలోనూ టికెట్లను రీసైకిల్ చేయడం, పార్కింగ్ ఫీజుల విషయంలో కూడా దందాలు వెలుగుచూశాయి.
బాసర ఆలయంలో లడ్డూ టికెట్ల చుట్టూ ఏర్పడిన అక్రమాల నేపథ్యంలో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేయగా, నలుగురు తాత్కాలిక సిబ్బందిని విధుల నుంచి తొలగించారు.
వివరాలు
వీఐపీ టికెట్ల కేటాయింపుపైనా చర్చ
ఈ మొత్తం వ్యవస్థలో వీఐపీ టికెట్ల కేటాయింపుపైనా సమగ్ర పరిశీలన అవసరమైందని తెలుస్తోంది.
పెద్ద సంఖ్యలో భక్తులు సాధారణ క్యూలైన్లలో నిన్నడలేక, వీఐపీ టికెట్ల కోసం ప్రయత్నిస్తున్న సందర్భాలను కొందరు తమ లాభాల కోసం వినియోగించుకుంటున్నారు.
దేవాలయాల్లో కొంతమంది సిబ్బంది, ఏండ్ల తరబడి ఒకే చోట పనిచేస్తూ, స్వచ్చందంగా వ్యవహరిస్తున్నారని భక్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.