LOADING...
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మహిళలకు ఉచితంగా 30రకాల వైద్య పరీక్షలు..
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..మహిళలకు ఉచితంగా 30రకాల వైద్య పరీక్షలు..

Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మహిళలకు ఉచితంగా 30రకాల వైద్య పరీక్షలు..

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 06, 2026
11:31 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వం మహిళల అభివృద్ధి దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యం ఇస్తూ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మహిళలకు మరింత మేలు చేకూరేలా రాబోయే రాష్ట్ర బడ్జెట్‌లో కొత్త కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మహిళా సాధికారతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఈ పథకాలను రూపొందిస్తోంది. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను ఆర్థికంగా బలపరచి కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందించడంతో పాటు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతోంది.

వివరాలు 

మహిళలు తీసుకునే రుణాలకు బీమా పథకం 

అంతేకాకుండా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించడం, క్యాంటీన్ల నిర్వహణలో అవకాశాలు కల్పించడం, అద్దె బస్సుల యాజమాన్యంలో భాగస్వామ్యం కల్పించడం వంటి చర్యలను కూడా ప్రభుత్వం తీసుకుంటోంది. ఇవి మాత్రమే కాకుండా రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల కోసం ప్రత్యేకంగా ఒక కొత్త విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు డ్వాక్రా గ్రూపులలో ఉన్న సభ్యులకు మాత్రమే ఇన్సూరెన్స్ సదుపాయం ఉండేది. బ్యాంకు నుంచి రుణం తీసుకున్న సభ్యురాలు మరణిస్తే ఆ అప్పును ఆమె కుటుంబ సభ్యులే చెల్లించాల్సి వచ్చేది. దీంతో బాధిత కుటుంబంపై ఆర్థిక భారం పడేది. ఇప్పుడు ఆ భారాన్ని తగ్గించేందుకు మహిళలు తీసుకునే రుణాలకు బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

వివరాలు 

100 రోజుల ఆరోగ్య మిషన్

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం రుణం తీసుకున్న మహిళ మరణిస్తే, ఆ రుణాన్ని ప్రభుత్వమే బ్యాంకుకు చెల్లిస్తుంది. అంతేకాకుండా ఆ సభ్యురాలికి రూ.10 లక్షల వరకు బీమా రక్షణ కూడా కల్పించనుంది. ఈ బీమాకు సంబంధించిన ప్రీమియంను కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఇక మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం "100 రోజుల ఆరోగ్య మిషన్" కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న మహిళల కోసం ప్రత్యేక హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలను ప్రారంభించనున్నారు.

Advertisement

వివరాలు 

ప్రతి మహిళకు ఒక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్

గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లోని పేద మహిళలు ఆర్థిక సమస్యల వల్ల వైద్యపరీక్షలు చేయించుకోలేని పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని,ఎటువంటి ఖర్చులేకుండా అత్యాధునిక డయాగ్నస్టిక్ సేవలను వారి ఇంటి దగ్గరికి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మహిళల్లో ప్రాణాంతకంగా మారే క్యాన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తించేందుకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను కూడా ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్నారు. అంతేకాకుండా ఈ ఆరోగ్య మిషన్ కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా ప్రతి మహిళకు ఒక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందించనుంది. ఈప్రొఫైల్ ద్వారా భవిష్యత్తులో వారికి ఏదైనా ఆరోగ్య సమస్య ఎదురైనప్పుడు వారి పూర్తి వైద్య వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. దీంతో వైద్యులకు అవసరమైన సమాచారం సులభంగా లభించి,బాధితులకు మరింత మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉంటుంది.

Advertisement