GHMC: జీహెచ్ఎంసీ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్.. జోన్లు, సర్కిల్స్ సంఖ్య పెంపు
ఈ వార్తాకథనం ఏంటి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిపాలనా వ్యవస్థను మరింత విస్తృతంగా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరం ఔటర్ రింగ్ రోడ్ (ORR) వరకు విస్తరించిన నేపథ్యంలో, పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో జోన్లు, సర్కిల్స్ సంఖ్యను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12కు, 30 సర్కిల్స్‌ను 60కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా ఏర్పాటు చేసిన జోన్లుగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ ప్రకటించబడ్డాయి. ఈ మేరకు సర్కిల్ కార్యాలయాల్లో కొత్త జోన్ కార్యాలయాలు, వార్డు కార్యాలయాల్లో కొత్త సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు.
Details
300 వార్డులతో ఫైనల్ నోటిఫికేషన్
త్వరలోనే ఈ కొత్త జోనల్, సర్కిల్ కార్యాలయాల నుంచే పరిపాలన కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇదే సమయంలో GHMC పరిధిలో వార్డుల పునర్విభజన (Delimitation) ప్రక్రియకు సంబంధించి 300 వార్డులతో ఫైనల్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 9న ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి, 10 రోజుల పాటు ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. ఈ ప్రక్రియలో 6,000కు పైగా అభ్యంతరాలు రావడంతో, వాటిలో సహేతుకమైనవాటిని పరిగణనలోకి తీసుకుని 300 వార్డులతో తుది నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేశారు.