Telangana Govt: రైతు భరోసా పథకంపై ప్రభుత్వం తెలంగాణ కీలక నిర్ణయం.. ప్రతి ఎకరా భూమికి రూ.12,000
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆర్థికంగా బలపరచడానికి అనేక కీలక చర్యలను తీసుకుంటోంది. ఈ క్రమంలో కొత్త పథకాలను ప్రవేశపెట్టి, పంటల సాగులో రైతులకు ప్రత్యక్ష మద్దతు అందిస్తోంది. అలాగే, రైతు భరోసా పథకం కింద సంవత్సరంలో రెండు విడతలుగా అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో నిధులను జమ చేస్తూ ప్రభుత్వం రైతుల ఆర్థిక భద్రతను పెంచుతోంది. అయితే, తాజాగా ఈ పథకంపై ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు ప్రకటించింది. ఈ మార్పుల కారణంగా రెండో విడత నిధులు కొన్ని ప్రత్యేక అర్హత కలిగిన రైతులకే అందనున్నాయి.
వివరాలు
ఖరీఫ్ సీజన్ నిధులు అర్హుల ఖాతాల్లో
ప్రతీ ఎకరా భూమికి రూ.12,000 ఇచ్చే రైతు భరోసా పథకం కింద, అర్హులైన రైతుల ఖాతాల్లో ఈ నిధులు రెండు విడతలుగా జమ చేసింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం కూడా విడతల వారీగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడం ప్రారంభమైంది. మొదట ఒక ఎకరా భూమి కలిగిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఆ తరువాత, రెండు, మూడు, నాలుగు ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాల్లో మిగిలిన నిధులు జమ చేసింది. రాబీ పంటల కోసం రైతు భరోసా నిధులు జనవరి, ఫిబ్రవరి నెలల్లో జమ చేయనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అయితే, ఈసారి పథకం అమలులో కొన్ని ముఖ్యమైన మార్పులు చేశారు.
వివరాలు
రైతు భరోసా నిధులు అర్హులైన ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం చర్యలు
రాష్ట్ర వ్యాప్తంగా యాసంగిలో సాగుతున్న పంట భూములను ఉపగ్రహ చిత్రాల (Satellite Mapping) ద్వారా గుర్తించి,రైతు భరోసా నిధులు అర్హులైన ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ పూర్తి అయిన వెంటనే, ఆ నివేదిక ఆధారంగా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి తెలిపారు. ఇటీవల, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకం అమలు, మార్గదర్శకాలను సమీక్షించారు. గతంలో పంటకు అనుకూలం కాని భూములకు కూడా నిధులు ఇచ్చిన సందర్భాలున్నాయి. అయితే, ఈసారి నిధులు కేవలం పంట సాగు చేసిన భూములకు మాత్రమే ఇవ్వబడతాయని సీఎం తెలిపారు. ప్రభుత్వ విధానం ప్రకారం, యాసంగిలో పంట సాగించిన రైతులే రైతు భరోసా నిధుల లబ్ధి పొందగలుగుతారు.