Hyderabad Zoo Park: తెలంగాణలో మరో జూపార్క్ ఏర్పాటు.. వివరాలివే
హైదరాబాద్‌లో మరో జూపార్క్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.రేవంత్ సర్కార్ ఈ విషయంలో కసరత్తు చేస్తోంది. జూపార్క్ ఎక్కడ ఏర్పాటు చేస్తారనే చర్చ జరుగుతున్నసమయంలో,హైదరాబాద్ నగర శివారులోని ముచ్చర్ల ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఫోర్త్ సిటీలో జూపార్క్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో 15వేల ఎకరాల రెవెన్యూ భూమి ఉండటంతో,అక్కడే జూపార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కొత్త జూపార్క్‌లో ప్రకృతి పర్యాటకం అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైట్ సఫారీ కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ తరహా పర్యాటక ప్రదేశాల గురించి మరింత సమాచారం కోసం అధికారులు గుజరాత్‌లోని జామ్‌నగర్ 'వన్‌తారా' వన్యప్రాణి సంరక్షణ కేంద్రంపై అధ్యయనం చేస్తున్నారు. అంతే కాకుండా,ఇతర ప్రదేశాల అధ్యయనాలు కూడా చేస్తున్నారు.
ఫోర్త్ సిటీ చుట్టుపక్కల 18 వేల ఎకరాల అటవీ భూములు
హైదరాబాద్ చుట్టూ హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న లక్షన్నర ఎకరాల అటవీ ప్రాంతం గురించి కూడా గుర్తించారు. అయితే రక్షిత అటవీ ప్రాంతాల్లో జూపార్క్‌లను ఏర్పాటు చేయడానికి అనుమతి లేకపోవడంతో, ఈ జూపార్కును రెవెన్యూ భూముల్లోనే ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలియజేశారు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఫోర్త్ సిటీ చుట్టుపక్కల 18 వేల ఎకరాల అటవీ భూములు ఉన్నాయని సమాచారం.
200 ఎకరాల విస్తీర్ణంలో జూపార్క్
ఈ ప్రాంతంలో 200 ఎకరాల విస్తీర్ణంలో జూపార్క్ ఏర్పాటు చేసి, 1000 ఎకరాల అటవీ ప్రాంతాన్ని గ్రీన్ బెల్ట్‌గా చూపించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రాజెక్టులో నైట్ సఫారీ కూడా ఏర్పాటు చేసే ప్రతిపాదనలున్నాయి. ఫోర్త్ సిటీలో ఉండే గుట్టలు, లోయలు, చెట్లతో కూడిన ప్రాంతం, రెవెన్యూ భూమి అయినప్పటికీ, అటవీ వాతావరణంలో ఉండటంతో జూపార్క్, నైట్ సఫారీకి అనువుగా ఉంటుంది. ఈ ప్రాజెక్టు నిర్వహణ కోసం పీపీపీ మోడల్‌ను అనుసరించాలని, రిలయన్స్ వంటి సంస్థలతో చర్చలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.