Telangana: 3 రకాలుగా సాగు భూముల విలువ సవరణ.. ఈ నెల 28 నుంచే అమలుకు సన్నాహాలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూములు, సాగేతర భూములు, స్థిరాస్తుల ప్రభుత్వ మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గ్రామీణ ప్రాంతాలు, జాతీయ రహదారుల పరిసరాలు, మండల కేంద్రాలు, పట్టణాలకు సమీపంలోని భూముల విలువలను మూడు వర్గాలుగా విభజించి కొత్త ధరలను నిర్ణయించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా బాహ్య వలయ రహదారి పరిధిలో బహిరంగ మార్కెట్ ధరలు, ప్రభుత్వ విలువల మధ్య భారీ తేడా ఉండటంతో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సవరణలు చేపట్టాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ భావిస్తోంది.
వివరాలు
50 శాతం వరకు పెంచే అవకాశాలు
మొత్తంగా వ్యవసాయ, సాగేతర భూములు, ఇతర స్థిరాస్తుల విలువలను 50 శాతం వరకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 28వ తేదీ నుంచి కొత్త ధరలను అమల్లోకి తీసుకురావాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ అంశంపై శాఖ కమిషనర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులతో పలుమార్లు సమావేశాలు నిర్వహిస్తూ కసరత్తు చేస్తున్నారు. సోమవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అధికారులతో విస్తృతంగా చర్చించారు. ప్రజలపై ఒక్కసారిగా అధిక భారం పడకుండా దశలవారీగా అమలు చేసే విధానంపై సూచనలు చేసినట్లు సమాచారం. మరో ఒకటి రెండు రోజుల్లో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
వివరాలు
ప్రభుత్వ విలువ మాత్రం రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల మధ్యే
ప్రస్తుతం రాష్ట్రంలో ఎకరా వ్యవసాయ భూమి కనిష్ఠ ప్రభుత్వ విలువ రూ.1.75 లక్షలుగా ఉండగా, దానిని రూ.2.75 లక్షలకు పెంచాలని ప్రతిపాదిస్తున్నారు. బాహ్య వలయ రహదారి లోపలి ప్రాంతాల్లో ప్రస్తుతం ఎకరా ప్రభుత్వ విలువ రూ.8.75 లక్షలుగా ఉండగా,దానిని కనిష్ఠంగా రూ.15 లక్షలకు పెంచాలని యోచిస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్‌లో భూముల ధరలు భారీగా పెరిగాయి. వట్టినాగులపల్లి వంటి ప్రాంతాల్లో ఎకరా భూమి ధర రూ.70 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు పలుకుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో రూ.150 కోట్ల వరకు నమోదవుతోంది. అయితే ప్రభుత్వ విలువ మాత్రం రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల మధ్యే ఉంది. దీనిని రూ.4 కోట్ల వరకు పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాలు
అపార్ట్‌మెంట్ల చ.అడుగు విలువ రూ.6 వేలకు
రాష్ట్రంలో అపార్ట్‌మెంట్‌ల ధరలను కూడా బహిరంగ మార్కెట్ విలువలకు అనుగుణంగా సవరించనున్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో చదరపు అడుగు విలువ రూ.3,500 నుంచి రూ.4 వేల మధ్య ఉండగా, దానిని దాదాపు రూ.6 వేల వరకు పెంచే అవకాశముంది. దీంతో ఫ్లాట్ల ప్రభుత్వ విలువలో సుమారు 75 శాతం వరకు పెరుగుదల ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
వివరాలు
అదనంగా రూ.1,500 కోట్ల రాబడి
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రస్తుతం ఏటా సుమారు రూ.15 వేల కోట్ల ఆదాయం వస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలో భూములు,స్థలాలు,అపార్ట్‌మెంట్‌లు,ఎత్తైన భవనాలు,విల్లాల రిజిస్ట్రేషన్ల ద్వారా అధిక ఆదాయం లభిస్తోంది. అయినప్పటికీ బహిరంగ మార్కెట్ ధరలకు,ప్రభుత్వ విలువలకు మధ్య భారీ వ్యత్యాసం కొనసాగుతోంది. చివరిసారిగా 2021, 2022 సంవత్సరాల్లో ధరల సవరణ చేపట్టారు. ఇప్పుడు మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మరోసారి విలువలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ సవరణల వల్ల ఏటా అదనంగా రూ.1,500కోట్ల వరకు ఆదాయం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్త ధరల అమలు తర్వాత ఆరు నెలల అనంతరం పరిస్థితిని సమీక్షించే అవకాశముంది. ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యం సూచనల మేరకే ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
350 ప్రాంతాల్లో ఒక్కో మాదిరి
హైదరాబాద్ మహానగర పరిధిలో ప్రాంతానికో విధంగా భూముల ధరలు ఉండటంతో 350 ప్రాంతాలకు వేర్వేరు ప్రమాణాల ప్రకారం ధరల పెంపు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఉదాహరణకు జూబ్లీహిల్స్‌లో ప్రస్తుతం చదరపు గజం ప్రభుత్వ విలువ రూ.80 వేల వరకు ఉండగా, దానిని రూ.90 వేల వరకు పెంచే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం.
వివరాలు
వాణిజ్య ప్రాంతాల్లో..
రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్య ప్రాంతాల్లో కూడా ఒకే విధమైన విధానంతో విలువలను సవరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఫ్లాట్ల బహిరంగ మార్కెట్ ధర చదరపు అడుగుకు రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల రూ.7,800 వరకు నమోదవుతోంది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ విలువను సగటున రూ.6,600 వరకు నిర్ణయించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా 100 అడుగుల రహదారులు, ప్రధాన అనుసంధాన మార్గాల పరిసర ప్రాంతాల్లో అక్కడి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా విలువలను పెంచనున్నారు.