వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను వేలంలో దక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్
ఆంధ్రప్రదేశ్ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునే దిశగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వేలం పాటలో బిడ్ వేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. కొన్ని నిర్వహణ కారణాల వల్ల కేంద్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించింది. ఈ క్రమంలో తమ ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ)ను నమోదు చేయవలసిందిగా మార్చి 27న కేంద్రం బిడ్డర్లను కోరింది. ఈఓఐ దాఖలు చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 15 కాగా, తెలంగాణ ప్రభుత్వం బిడ్ వేసేందుకు ఆసక్తిని వ్యక్తపరిచింది. తెలంగాణ ప్రభుత్వం నడుపుతున్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) లేదా తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ( టీఎస్ఎండీసీ) ఈఓఐని సమర్పించడానికి పరిశీలనలో ఉన్నాయి.
వ్యూహాత్మకంగా కేసీఆర్ బిడ్ వేస్తున్నారా?
తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులతో సమావేశమై వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై చర్చించినట్లు ప్రగతి భవన్ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో నాయకులు స్టీల్ ప్లాంట్‌ను కూడా సందర్శించి, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు సంఘీభావం తెలుపుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం బిడ్డింగ్ ప్రక్రియలో చేరడం వల్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకున్నట్లు అవుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలోని అధికార వైసీపీని ఇరకాటంలో పెట్టొచ్చనే వ్యూహంలో కేసీఆర్ ఉండి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.