LOADING...
Traffic Rules: సిగ్నల్‌ దాటితే వెంటనే ఈ-చలాన్‌.. ట్రాఫిక్‌ అమలులో కొత్త పద్ధతులు
సిగ్నల్‌ దాటితే వెంటనే ఈ-చలాన్‌.. ట్రాఫిక్‌ అమలులో కొత్త పద్ధతులు

Traffic Rules: సిగ్నల్‌ దాటితే వెంటనే ఈ-చలాన్‌.. ట్రాఫిక్‌ అమలులో కొత్త పద్ధతులు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 22, 2025
09:08 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంటి నుండి బైక్‌ లేదా కారులో బయటకు బయల్దేరే ముందు జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్‌ నియమాలను తేలికగా తీసుకుంటే జేబుకు గట్టి చిల్లు కట్టాల్సిందే. రోడ్డుపై పోలీసులు లేదా ఆర్టీఏ అధికారులు కనిపించలేదని, ఎవరూ ఫోటోలు తీయలేదని ఊహించడం పొరపాటు. ప్రస్తుతం రహదారులపై ఎలక్ట్రానిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విస్తృతంగా పెరుగుతోంది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఏఐ కెమెరాలు రోడ్లపై అమర్చబడి, నియమాలు అతిక్రమించే వారిని వెంటనే గుర్తిస్తున్నాయి. వీటితో పాటు, ఎప్పటిలాగే అధికారులు కూడా ఎక్కువ సంఖ్యలో తనిఖీలు చేస్తున్నారు.

వివరాలు 

రోజుకు రూ.2.25 కోట్ల జరిమానాలు 

ఈ సంవత్సరం తొలి ఆరు నెలల్లో వాహనదారులపై వసూలు చేసిన జరిమానాలను పరిశీలిస్తే,రోజుకు సగటున రూ.2.25 కోట్లు ఫైన్ల రూపంలో వసూలవుతున్నాయి. జనవరి నుండి జూన్‌ వరకు మొత్తం రూ.412 కోట్ల జరిమానాలు విధించారు. గత ఏడాది ఇదే కాలంలో రూ.265 కోట్లు వసూలైన నేపథ్యంలో ఈసారి 56 శాతం పెరుగుదల నమోదు కావడం ప్రత్యేకత. ప్రస్తుత ధోరణి కొనసాగితే, ఏడాది చివరి నాటికి జరిమానాల మొత్తం రూ.800 కోట్లు దాటే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా, రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేస్తూ, డిసెంబర్‌ కల్లా ప్రమాదాలను 30 శాతం వరకు తగ్గించాలన్న ఆదేశాలు ఇచ్చింది. అందువల్ల రాబోయే నెలల్లో మరిన్ని తనిఖీలు, చలాన్లు తప్పవని అంచనా.

వివరాలు 

ఏఎన్‌పీఆర్‌ కెమెరాల విధానం 

రహదారులపై ఏర్పాటు చేసిన ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు వాహనాల నంబర్‌ ప్లేట్లను స్కాన్‌ చేసి ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌కి సమాచారం పంపిస్తాయి. దీంతో వాహనానికి సంబంధించిన అన్ని వివరాలు సిస్టమ్‌లో ప్రత్యక్షమవుతాయి. డ్రైవింగ్‌ లైసెన్స్‌ చెల్లుబాటు కాలం, వాహన బీమా గడువు ముగిసిందా అనే విషయాలను కూడా వెంటనే చెక్‌ చేస్తుంది. ఉల్లంఘనలు జరిగితే అవి రికార్డులోకి చేరతాయి. ఆటోమేటిక్‌ చలాన్‌ జారీ సిగ్నల్‌ దాటడం, స్టాప్‌లైన్‌ క్రాస్‌ అవడం, హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడపడం వంటి ట్రాఫిక్‌ నియమాల అతిక్రమణలు తక్షణమే గుర్తించబడతాయి. ఈ ఉల్లంఘనలపై సిస్టమ్‌ ద్వారా ఈ-చలాన్‌ ఆటోమేటిక్‌గా జారీ అవుతుంది.

వివరాలు 

ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు ఎక్కడ ఎన్నంటే.. 

పోలీస్‌ శాఖ ఇప్పటికే 792 ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు ఏర్పాటు చేసింది. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 549 ఉండగా, జిల్లాల్లో 243 అమర్చబడ్డాయి. రవాణా శాఖ 60 కెమెరాలు ఏర్పాటు చేయడానికి టెండర్లు పిలిచింది. అదనంగా, ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో 100 ఈ-ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పరికరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.