Electric vehicle policy: ఈవీ కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త.. నేటి నుంచి అమల్లోకి సరికొత్త పాలసీ
విద్యుత్ వాహనాలు (ఈవీ) కొనుగోలు చేయాలనుకునే వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రోడ్ ట్యాక్స్, వాహన రిజిస్ట్రేషన్ రుసుముల్లో 50 శాతం మినహాయింపు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకారం, ఈ నూతన విధానం రాష్ట్రంలోని వాహన కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.
కాలుష్యాన్ని తగ్గించేందుకు విద్యుత్ వాహనాల ప్రోత్సాహం
ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానం నేటి(సోమవారం) నుంచి అమల్లోకి వస్తుందని రవాణా శాఖ మంత్రి వెల్లడించారు . పరిమిత సంఖ్యలో వాహనాలకు మాత్రమే మినహాయింపు ఉన్నప్పటికీ, ఇప్పుడు ఈ పరిమితులను ఎత్తివేసినట్లు మంత్రి వెల్లడించారు. 50% మినహాయింపు ఎవరికి వర్తిస్తుంది? ద్విచక్ర వాహనాలు కార్లు ఆటోలు ఆర్టీసీ బస్సులు ఇతర కార్పొరేట్ సంస్థల యాజమాన్యంలోని ఎలక్ట్రిక్ బస్సులు
2026 వరకు అమలులోకి..
ఈ విధానం 2026 డిసెంబరు 31 వరకు అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌కు వచ్చే అన్ని విద్యుత్ వాహనాలకూ ఇది వర్తిస్తుంది. అవసరమైతే ఈ గడువును పొడిగించడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. పన్ను మినహాయింపు వల్ల ప్రయోజనాలు రాష్ట్రానికి వందల కోట్ల ఆదాయం నష్టపోయినా, ఇది కాలుష్యాన్ని తగ్గించి శుద్ధమైన వాతావరణాన్ని రూపొందించడంలో సహాయపడుతుంది. విద్యుత్ వాహనాల ద్వారా భవిష్యత్ తరాలకు ఒక శుభవాతావరణం అందించడమే ప్రధాన ఉద్దేశం.
జీవో 41 ప్రకారం
విద్యుత్ వాహనాలపై ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశంలో వినూత్నంగా మారవచ్చని రవాణా శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ వాహనాలు కలిగిన వ్యక్తులు అదనంగా 2 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ, రెండో వాహనంగా విద్యుత్ వాహనం ఉంటే, ఈ అదనపు పన్నును కూడా మినహాయిస్తారు. ఈ విధానం రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగం పెంచడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి కీలకంగా నిలుస్తుంది.