
HAM Roads: హ్యామ్ మోడల్‌లో రహదారుల అభివృద్ధికి రూ.6,478 కోట్లు - మొదటి దశలో 373 రోడ్లకు టెండర్లు
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) పద్ధతిలో చేపట్టే రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొలి దశలో 17 ప్యాకేజీలుగా విభజించి,మొత్తం 373 రహదారుల పనులకు రూ.6,478.33 కోట్ల వ్యయంతో బిడ్డింగ్ ప్రక్రియకు అనుమతి ఇచ్చింది. ఇందులో మొత్తం 5,190.25 కిలోమీటర్ల రహదారులను హ్యామ్ విధానంలో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఉన్న 4,840 కిలోమీటర్ల రోడ్లను బలోపేతం చేయడమే కాకుండా,అదనంగా 350 కిలోమీటర్ల వరుస రహదారులను రెండు వరుసలుగా విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్టులపై మద్దతు తెలిపిన కన్సల్టెన్సీ సంస్థ సూచనల మేరకు R&B సర్కిళ్ల వారీగా టెండర్లను ఆహ్వానించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
వివరాలు
మునుపటి ప్రణాళికలో మార్పులు
నల్గొండ సర్కిల్ పరిధిలో భారీ రహదారి నెట్‌వర్క్ ఉన్న నేపథ్యంలో, అక్కడ రెండు ప్యాకేజీలుగా టెండర్లు పిలవాలని కన్సల్టెన్సీ సంస్థ సూచించింది. తొలుత ,హ్యామ్ పద్ధతిలో రాష్ట్ర రహదారుల అభివృద్ధికి తొలుత 9 ప్యాకేజీలుగా పనులు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అయితే, తర్వాత సీఎం కార్యాలయం నుంచి వచ్చిన మార్గదర్శకాలు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హ్యామ్ ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్షల అనంతరం,ఈ ప్యాకేజీలను 17కు పెంచాలని నిర్ణయించారు. గతంలో గుర్తించిన కొన్ని రహదారులను ప్రస్తుత టెండర్ల నుంచి తొలగించి,ట్రాఫిక్ తీవ్రత అధికంగా ఉండే కొత్త రహదారులను చేర్చారు. ముఖ్య పట్టణాల నుంచి జిల్లా కేంద్రాలకు వెళ్లే మార్గాలను ఈ కొత్త ప్యాకేజీలలో చేర్చారు.
వివరాలు
అభినందనలు తెలిపిన మంత్రి
అంతేగాక, ఫ్యూచర్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ పాత జిల్లాలలో ముందుగా తక్కువ రహదారులే ఎంపిక కాగా, తాజా మార్పుల్లో ఈ జిల్లాల్లో హ్యామ్ రహదారుల సంఖ్యను గణనీయంగా పెంచారు. ఈ హ్యామ్ ప్రాజెక్టుల తొలి దశకు సీఎం ఆమోదం తెలపడంతో, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రణాళికపై సమగ్ర నివేదిక అందించిన అధికారులను కూడా ఆయన అభినందించారు. అభివృద్ధితోపాటు సంక్షేమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా తీసుకుపోతుందని ఆయన స్పష్టం చేశారు.