Telangana Govt : జీతం తీసుకుంటూనే పింఛన్,ఇల్లు? 37 వేల మంది ఉద్యోగులపై చర్యలకు రంగం సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అనర్హులను గుర్తించి తొలగించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ముఖ్యంగా పేదలకు ఉద్దేశించిన పథకాల్లో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా లబ్ధిదారులుగా మారిన విషయం ఉన్నతాధికారుల పరిశీలనలో బయటపడింది. ఈ నేపథ్యంలో అర్హత లేని వారిని గుర్తించి లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇదే క్రమంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని రేవంత్ సర్కార్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వివరాలు
ఉపాధి హామీ కూలీ నిధులు.. పొందుతున్నట్టు అధికారిక లెక్క
ప్రభుత్వ ఖజానా నుంచి నెలనెలా జీతాలు అందుకుంటున్న కొంతమంది ఉద్యోగులు, పేదలకు మాత్రమే ఇవ్వాల్సిన పింఛన్లు, ఇండ్ల పథకాలు, అలాగే ఉపాధి హామీ కూలీ నిధులను కూడా పొందుతున్నట్టు అధికారిక లెక్కల్లో స్పష్టమైంది. ఈ అంశంపై ప్రభుత్వం సిద్ధం చేసిన నివేదికలో దాదాపు 37 వేల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు వివిధ సంక్షేమ పథకాల ద్వారా లాభాలు పొందుతున్నారని తేలింది. వీరిలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో పాటు రెగ్యులర్ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ జాబితాలో తక్కువ స్థాయి సిబ్బందే కాకుండా, ఉన్నత హోదాల్లో ఉన్న ఉద్యోగుల పేర్లు కూడా ఉండటంతో.. ఈ పేర్లు లబ్ధిదారుల జాబితాలో ఎలా చేరాయన్నది ఇప్పుడు కీలక చర్చగా మారింది.
వివరాలు
ప్రభుత్వానికి స్పష్టమైన సిఫార్సులతో కూడిన నివేదిక
ప్రభుత్వం అమలు చేస్తున్న పేదల సంక్షేమ పథకాలలో ఏ పథకంలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందుతున్నారు, వారిలో ఎంతమంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, ఎంతమంది రెగ్యులర్ ఉద్యోగులన్న పూర్తి వివరాలను ఉన్నతాధికారులు ఇప్పటికే సేకరించారు. ఈ సమాచారాన్ని ఆధారంగా తీసుకుని ప్రభుత్వానికి స్పష్టమైన సిఫార్సులతో కూడిన నివేదికను సమర్పించారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్, మినిమమ్ టైమ్ స్కేల్, స్టేట్ స్కేల్ కింద జీతాలు పొందుతున్న రెగ్యులర్ ఉద్యోగులు, అలాగే టైమ్ స్కేల్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను తక్షణమే నిలిపివేయాలని ఆ నివేదికలో స్పష్టంగా సూచించారు. నిబంధనల ప్రకారం వీరంతా అనర్హులేనని అధికారులు తేల్చిచెప్పారు.
వివరాలు
సంబంధిత ఉద్యోగులపై చర్యలు
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, డైలీ వేజ్, అలాగే హానరేరియం (గౌరవ వేతనం)పై పనిచేస్తున్న సిబ్బంది విషయంలో ప్రభుత్వం విధానపరమైన స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఉన్నతాధికారులు నివేదికలో పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో దాని ప్రకారం సంబంధిత ఉద్యోగులపై చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంటే, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 37 వేల మంది ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పూర్తిగా నిలిచే అవకాశముందని తెలుస్తోంది.