LOADING...
Telangana: తెలంగాణలో పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు.. జూన్ నుండి అదనపు భారం!
తెలంగాణలో పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు.. జూన్ నుండి అదనపు భారం!

Telangana: తెలంగాణలో పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు.. జూన్ నుండి అదనపు భారం!

వ్రాసిన వారు Moogati Shabari
May 15, 2026
05:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో త్వరలో ఆస్తి రిజిస్ట్రేషన్ ఖర్చులు గణనీయంగా పెరగనున్నాయని సమాచారం వెలువడుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాల్లో భూముల ప్రభుత్వ మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుండటంతో, జూన్ నెల నుంచి ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లో భూముల ప్రభుత్వ ధరలను 15 శాతం నుంచి 30 శాతం వరకు పెంచాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సవరించిన విలువలు జూన్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశముంది.

వివరాలు

నెలకు రూ.150 కోట్ల నుంచి రూ.180 కోట్ల వరకు అదనపు భారం..

ప్రస్తుతం ఈ మూడు జిల్లాల్లో ప్రతి నెల సుమారు 40 వేల నుంచి 50 వేల వరకు ఆస్తి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. మార్కెట్ విలువలు 15 శాతం పెరిగితే కొనుగోలుదారులపై నెలకు రూ.150 కోట్ల నుంచి రూ.180 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. అదే పెంపు 30 శాతానికి చేరితే ఈ భారం నెలకు రూ.300 కోట్ల నుంచి రూ.360 కోట్ల వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఐటీ కారిడార్లు, ఔటర్ రింగ్ రోడ్ పరిసరాలు, వాణిజ్య ప్రాంతాలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండనుంది.

వివరాలు

భారీగా పెరగనున్న భూములు..

ముఖ్యంగా గచ్చిబౌలి, కొండాపూర్, నానక్‌రామ్‌గూడ, ఖాజాగూడ, మియాపూర్, రాయదుర్గం, మాదాపూర్, ఫిలింనగర్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల విలువలు భారీగా పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ మార్కెట్ విలువ పెరిగితే, దానికి అనుసంధానంగా స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా స్వయంచాలకంగా పెరుగుతాయి. ఉదాహరణకు, ప్రస్తుతం ఒక ప్రాంతంలో గజానికి ప్రభుత్వ ధర రూ.7,500గా ఉంటే, దానిపై 30 శాతం పెంపు అమలైతే కొత్త ధర గజానికి రూ.9,750కి చేరుతుంది. దీంతో 100 గజాల స్థలాన్ని కొనుగోలు చేసే వ్యక్తి ప్రస్తుతం చెల్లిస్తున్న సుమారు రూ.56,200 రిజిస్ట్రేషన్ ఖర్చుల బదులుగా, సవరణ తర్వాత రూ.73,125కు పైగా చెల్లించాల్సి రావచ్చు.

Advertisement

వివరాలు

గజానికి రూ.25 వేల నుంచి రూ.60 వేల వరకూ పెరిగే ఛాన్స్..

గచ్చిబౌలి, రాయదుర్గం, మెహదీపట్నం, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో ప్రతిపాదిత ప్రభుత్వ ధరలు గజానికి రూ.1.10 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు ఉండే అవకాశముందని నివేదికలు సూచిస్తున్నాయి. అలాగే ఔటర్ రింగ్ రోడ్ అవతలి ప్రాంతాలు, ముచ్చర్ల సమీపంలో అభివృద్ధి చెందుతున్న 'భారత్ ఫ్యూచర్ సిటీ' చుట్టుపక్కల ప్రస్తుతం గజానికి రూ.25 వేల నుంచి రూ.60 వేల వరకు ఉన్న ధరలు కూడా మరింత పెరగనున్నాయి.

Advertisement

వివరాలు

ప్రభుత్వం కీలక నిర్ణయం..

ధరల పెంపు అమల్లోకి రాకముందే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని ప్రజలు పెద్ద సంఖ్యలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు చేరుకుంటుండటంతో అక్కడ రద్దీ పెరిగింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్యూర్ పరిధిలోని కొన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల పని వేళలను ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు పొడిగించింది. ఈ పొడిగించిన పని వేళలు అమల్లో ఉండే కార్యాలయాల్లో చంపాపేట్, సరూర్‌నగర్, వనస్థలిపురం, గండిపేట్, మహేశ్వరం, ఫరూఖ్‌నగర్, షాద్‌నగర్, రంగారెడ్డి రూరల్, ఎల్‌బీ నగర్, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్ ప్రాంతాలు ఉన్నాయి.

Advertisement