మహిళల కోసం 'గృహలక్ష్మి' పథకాన్ని ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం; ఇంటి నిర్మాణానికి రూ.3లక్షలు
సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలనే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి అనే కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద ప్రతి లబ్ధిదారునికి వారి అవసరాలకు అనుగుణంగా ఇంటిని నిర్మించుకునేందుకు రూ.3 లక్షల సాయాన్ని అందించనుంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను గురువారం రాత్రి ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. పోడు భూములకు పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీని ప్రారంభించడంతో పాటు రెండో దశ దళిత బంధు, గొర్రెల పంపిణీ పథకాలను కొనసాగించాలని నిర్ణయించినట్లు హరీష్ రావు ప్రకటించారు.
రూ.3లక్షలు మూడు విడతలుగా అందజేత
రాష్ట్ర ప్రభుత్వం గృహ లక్ష్మి పథకం కింద మొత్తం 4లక్షల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు అందజేస్తుందని ఆర్థిక మంత్రి హరీష్ రావు చెప్పారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో ఒక్కోదానికి 3,000 ఇళ్లు మంజూరు చేయనున్నారు. రాష్ట్ర కోటా కింద మరో 43,000 ఇళ్లు అందజేయనున్నారు. ఈ పథకం కింద ఇళ్లు మహిళా లబ్ధిదారుల పేరు మీద మాత్రమే మంజూరు చేస్తామని, లక్ష రూపాయల చొప్పున మూడు విడతలుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని హరీష్ రావు ప్రకటించారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఇప్పటికే దాదాపు రూ.12,000 కోట్లు కేటాయించామని చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ఇళ్ల స్థలాల పంపిణీ రెండూ విడివిడిగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.