women's day 2023: 'ఉమెన్స్ డే' రోజున మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న మహిళలందరికీ సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8నుంచి మహిళల కోసం వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ (ఎంఏ&యూడీ)శాఖ నిర్ణయించింది.
మహిళా శక్తి ప్రాముఖ్యతను, సమాజంలో వారి పాత్రను తెలియజేస్తూ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, పారిశుద్ధ్య కార్మికులు, స్వచ్ఛంద సంస్థల్లో ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొని కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
మహిళా దినోత్సవం
మహిళా ఉద్యోగుల కోసం కంటి వెలుగు శిబిరాలు
మహిళా వారోత్సవాల సందర్భంగా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు, వివిధ రంగాల్లో విజయం సాధించిన ప్రగతిశీల మహిళలకు సన్మానం వంటి కార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అంతే కాకుండా పొడి చెత్త, వంటగది వ్యర్థాలు, నీటి సంరక్షణను సమర్థవంతంగా నిర్వహించడంలో వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్న స్థానిక సంస్థలతోపాటు ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న మహిళలను గుర్తించి సత్కరిస్తామని కేటీఆర్ తెలిపారు.
అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల ద్వారా తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన, మహిళా ఉద్యోగుల కోసం కంటి వెలుగు శిబిరాలు నిర్వహించేందుకు మున్సిపల్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
మహిళల్లో మరింత అవగాహన కల్పించేందుకు మహిళల ఆరోగ్యం, భద్రత, సాధికారతపై ప్రత్యేక సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.