MLA Danam Nagender: ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన హైకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపుపై పిటిషన్లు దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని కోరుతూ భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారని పిటిషన్లలో పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారని తెలిపారు.
వివరాలు
స్పీకర్ నిర్ణయంపై అభ్యంతరాలు
పార్టీ ఫిరాయింపులకు సంబంధించి రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించకుండా దానం నాగేందర్ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు.
ఆయనపై అనర్హత వేటు వేయాలని హైకోర్టును కోరారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన పలు ఆధారాలను స్పీకర్‌కు సమర్పించినప్పటికీ, వాటిని పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్లు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
సరైన ఆధారాలు లేవంటూ స్పీకర్ ట్రైబ్యునల్ మార్చి 11న ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.
వివరాలు
దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ
స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సీజే ధర్మాసనం పూర్తిస్థాయిలో విచారణ జరిపింది.
విచారణ అనంతరం దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఖైరతాబాద్ శాసనసభ స్థానం ఖాళీ అయినట్లు స్పీకర్, ఎన్నికల సంఘానికి ధర్మాసనం సమాచారం ఇచ్చింది.