
Sada bainama: సాదా బైనామాకు లైన్ క్లియర్ .. మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసిన హైకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
సాదా బైనామాల క్రమబద్ధీకరణకు సంవత్సరాలుగా కొనసాగుతున్న అడ్డంకులు చివరికి తొలగిపోయాయి. ఈ క్రమంలో 2020అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 112పై హైకోర్టు విధించిన మధ్యంతర ఉత్తర్వులను మంగళవారం ధర్మాసనం ఎత్తివేసింది. 1971లో అమలులో ఉన్న ఆర్వోఆర్ చట్టం రద్దయి,దాని స్థానంలో కొత్తగా భూభారతి చట్టం అమల్లోకి వచ్చినందున పాత చట్టానికి సంబంధించిన ప్రజాప్రయోజన వ్యాజ్యం కొనసాగించడం ప్రయోజనరహితమని కోర్టు స్పష్టం చేసింది. నిర్మల్ జిల్లాకు చెందిన షిండే దేవిదాస్ ఈ వ్యాజ్యం దాఖలు చేయగా,2020 నవంబరు 11న హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చింది. అప్పట్లో ధరణి చట్టంలో స్పష్టమైన నిబంధనలేకుండా క్రమబద్ధీకరణ చేయడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. అయితే,తాజా ప్రభుత్వం ఆ స్టేను ఎత్తివేయాలని కోరుతూ మధ్యంతర పిటిషన్ వేసింది.
వివరాలు
తొమ్మిది లక్షలకు పైగా దరఖాస్తులు
ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ ఎ. సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, 2014కు ముందు 12 ఏళ్లపాటు సాదా బైనామాల కింద భూములు కొనుగోలు చేసిన వారికి క్రమబద్ధీకరణ అవకాశమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. 2020లో ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా తొమ్మిది లక్షలకు పైగా దరఖాస్తులు అందాయని గుర్తుచేశారు. భూభారతి అనే కొత్త చట్టాన్ని తీసుకువచ్చి, దానిలోని సెక్షన్ 6 ప్రకారం 2014కు ముందే భూమిని స్వాధీనం చేసుకున్నవారికి క్రమబద్ధీకరణ చేయాలని నిర్ణయించామని వివరించారు.
వివరాలు
కోర్టు అసంతృప్తి
ఇక పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది జె. ప్రభాకర్ వాదనలు వినిపించారు. కొత్త చట్టంలోని నిబంధనలను కూడా సవాలు చేస్తూ సవరణ పిటిషన్ దాఖలు చేశామని, దానిపై వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. అయితే, ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుని కొత్త చట్టం వచ్చినప్పటికీ ఇప్పటివరకు కొత్త పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది. గతంలో పలుమార్లు వాయిదాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు సవరణ పిటిషన్ తీసుకొచ్చారంటూ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీని వల్ల ప్రక్రియ మరింత ఆలస్యమవుతుందని వ్యాఖ్యానించింది.
వివరాలు
తగిన కారణాలు చూపితే కొత్త పిటిషన్
న్యాయవాది తన వాదన కొనసాగిస్తూ,కొత్త చట్టంలో కూడా పాత దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారని,కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని నిరాకరించడం వివక్షతకే ఉదాహరణనని అన్నారు. కొత్త పిటిషన్ దాఖలు చేస్తామని, అప్పటివరకు కనీసం వారం రోజులు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు ఇవ్వకుండా ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. దీనిపై ధర్మాసనం స్పష్టం చేస్తూ, పిటిషనర్ తగిన కారణాలు చూపితే కొత్త పిటిషన్ వేసుకోవచ్చని చెప్పింది. అయితే, గత పిటిషన్‌తో సంబంధం లేని అంశాలను సవరణ పిటిషన్‌గా అనుమతించలేమని పేర్కొంది. తుదకు, ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో సన్నకారు, మధ్య తరగతి రైతులకు సంబంధించిన సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అడ్డుగా ఉన్న మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. దీంతో క్రమబద్ధీకరణకు మార్గం సుగమమైంది.