Loading...
Telangana High Court: ఉచితాల భారం పెరిగితే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ డేంజర్ జోన్‌లోకి: హైకోర్టు
ఉచితాల భారం పెరిగితే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ డేంజర్ జోన్‌లోకి: హైకోర్టు

Telangana High Court: ఉచితాల భారం పెరిగితే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ డేంజర్ జోన్‌లోకి: హైకోర్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2026
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ఉచిత పథకాల అమలు, వాటి వల్ల ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారంపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కల్యాణలక్ష్మి,షాదీ ముబారక్ పథకాల రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఎన్.వి.శ్రవణ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. చట్టబద్ధమైన ప్రక్రియ,అసెంబ్లీ తీర్మానం లేకుండా కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల (జీవోలు) ఆధారంగా ప్రజాధనాన్ని ఖర్చు చేసే పథకాలను ఎలా కొనసాగిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వం నాలుగు వారాలు గడిచినా కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సంబంధిత పథకాల అమలుపై మధ్యంతర 'స్టే' విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను మరో నాలుగు వారాలకు వాయిదా వేసింది.

వివరాలు 

జీతాలు,అప్పులు,సంక్షేమానికే ఆదాయంలో అధిక భాగం

రాష్ట్ర బడ్జెట్ అంచనాలు, ప్రభుత్వ ఆదాయ పరిస్థితిని ప్రస్తావించిన హైకోర్టు.. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం ఉద్యోగుల జీతాలు, అప్పుల చెల్లింపులు, సంక్షేమ పథకాలకే వెచ్చించాల్సి వస్తే అభివృద్ధి కార్యక్రమాలకు మిగిలేది కొద్దిపాటి మొత్తమేనని పేర్కొంది.

పేదలు, నిజంగా అర్హత ఉన్నవారికి ప్రభుత్వం సహాయం చేయడం సమంజసమేనని అభిప్రాయపడింది.

అయితే ఆర్థికంగా స్థోమత ఉన్నవారికి కూడా ఉచిత పథకాల ప్రయోజనాలు అందుతున్న పరిస్థితి ఆందోళనకరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఇలాంటి విధానాలు కొనసాగితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లే అవకాశం ఉందని హెచ్చరించింది.

వివరాలు 

పని సంస్కృతిపై తీవ్ర వ్యాఖ్యలు

ఉచిత పథకాల ప్రభావంతో ప్రజల్లో పని చేయాలనే ఆసక్తి తగ్గుతోందన్న అంశాన్ని కూడా హైకోర్టు ప్రస్తావించింది.

పల్సర్ బైక్‌లు, ఐఫోన్లు వంటి ఖరీదైన వస్తువులు కలిగి ఉన్నవారు సైతం ఉచిత బియ్యం కోసం వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది.

దీని వల్ల ప్రజల్లో పని సంస్కృతి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేసింది.

వ్యవసాయ పనులకు స్థానికంగా కూలీలు లభించక ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకురావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ధర్మాసనం పేర్కొంది.

ఇదే పరిస్థితి భవిష్యత్తులోనూ కొనసాగితే.. 'ఒకప్పుడు మనుషులు పని చేసేవారట' అని మ్యూజియంలో ప్రదర్శించాల్సిన పరిస్థితి రావచ్చంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

రాజకీయ ప్రయోజనాల కోసం అర్హత లేని వారికీ ఉచితాలా?

రాజకీయ కారణాలతో ఒక్క తెల్ల రేషన్ కార్డును కూడా తొలగించే విషయంలో ప్రభుత్వాలు వెనుకడుగు వేస్తున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఐఫోన్లు, ఐప్యాడ్లు వంటి ఖరీదైన పరికరాలు ఉపయోగిస్తున్నవారు కూడా ఉచిత పథకాల ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొంది.

ఇలాంటి విధానం నిరంతరం కొనసాగితే భవిష్యత్తులో ఆర్థికంగా ఎంత సంపన్నుడైనా తన వద్ద ఉన్న డబ్బంతా ఖర్చై చివరకు ఉపాధి హామీ తరహా పనులకు కూలీగా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది.

ప్రస్తుత విధానాల ప్రభావం రాబోయే తరాల భవిష్యత్తుపై పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజాధనం వినియోగం, సంక్షేమ పథకాల అమలుపై మరింత స్పష్టత అవసరమని పేర్కొంటూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ADVERTISEMENT