మంగపేటలోని 23 గ్రామాలపై హైకోర్టు సంచలన తీర్పు.. 75 ఏళ్లకు గిరిజనులకు అనుకూలమైన తీర్పు
చరిత్రాత్మకమైన కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాలేనని గుర్తించింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. సదరు గ్రామాలన్నీ రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ పరిధిలోకే వస్తాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని సీజే ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే గిరిజనేతరుల అప్పీల్‌ను కొట్టి వేస్తూ తీర్పు వెలువరించింది.
అవన్నీ షెడ్యూల్ స్టేటస్ కలిగిన గ్రామాలే : హైకోర్టు
దాదాపు 75 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం తీర్పు అనుకూలంగా రావడంతో ఆయా గ్రామాల్లోని గిరిజనులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంగపేట మండలంలోని 23 గ్రామాలన్నీషెడ్యూల్ 5 పరిధిలోకే వస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని షెడ్యూల్ - 5 అంటే గిరిజనులకు, ఆదివాసీయులకు సంబంధించిన ప్రత్యేక ప్రాంతాలు, వాటి హక్కులు. ఆయా ఏరియాల్లో ఎస్టీలకు ప్రత్యేకంగా భూ హక్కులు కల్పించబడతాయి. రాజ్యాంగం ప్రకారం ఒక నిర్థిష్టమైన భూ భాగాన్ని ఐదో షెడ్యూల్ పరిధిలోకి తీసుకువచ్చినప్పుడు గిరిజనుల నుంచి గిరిజనేతరులకు భూ బదలాయింపు జరగదు.ఒకవేళ బలవంతంగా చేసినా కోర్టులు వాటిని రాజ్యంగా విరుద్ధంగా ప్రకటిస్తూ కొట్టేస్తాయి.