Page Loader
ట్విట్టర్ పిటిషన్ కొట్టేసిన కర్ణాటక హైకోర్టు.. రూ.50 లక్షల ఫైన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ
రూ.50 లక్షల ఫైన్ విధిస్తూ ఉత్తర్వులు జారీcaption here

ట్విట్టర్ పిటిషన్ కొట్టేసిన కర్ణాటక హైకోర్టు.. రూ.50 లక్షల ఫైన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 30, 2023
03:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

క‌ర్ణాట‌క హైకోర్టులో ట్విట్ట‌ర్ సంస్థ‌కు భారీ షాక్ తగిలింది. ఈ మేరకు రూ.50 లక్షల జరిమానాను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్ర‌భుత్వం జారీ చేసిన మార్గదర్శకాలపై ట్విట్టర్ పలు అభ్యంత‌రాలను లేవనెత్తింది. అనంతరం వాటిని సవాల్ చేస్తూ సదరు సోషల్ మీడియా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు సదరు సంస్థకు భారీ ఫైన్ విధిస్తూ దరఖాస్తును కొట్టివేసింది. కొన్ని ఎంపిక చేసిన అకౌంట్లను నిలిపివేయాలని కేంద్రం జారీ చేసిన ఆదేశాలను ట్విట్టర్ వ్యతిరేకించింది. ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా సామాజిక మాధ్యమం కోర్టును ఆశ్రయించడం నిబంధనలకు విరుద్ధమని న్యాయమూర్తి కృష్ణ దీక్షిత్ పేర్కొన్నారు.

DETAILS

అకౌంట్ల‌ను బ్లాక్ చేసే అధికారం సర్కారుకు ఉంది : ఉన్నత న్యాయస్థానం

ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ సంస్థపై రూ. 50 లక్షల జరిమానా విధించారు. 45 రోజుల్లోగా క‌ర్ణాటక లీగ‌ల్ సెల్ స‌ర్వీసెస్‌కు సదరు మొత్తాన్ని చెల్లించాల‌ని ట్విట్ట‌ర్‌ను కోర్టు ఆదేశించింది. కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆదేశాల మేరకు ట్విట్ట‌ర్ ఎలాంటి వివ‌ర‌ణ‌ ఇవ్వ‌లేద‌ని గుర్తించింది. కేంద్ర ప్ర‌భుత్వ ఆదేశాల‌ను స‌మ‌ర్ధిస్తూ ట్వీట్ల‌ను, అకౌంట్ల‌ను బ్లాక్ చేసే అధికారం సర్కారుకు ఉంద‌ని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, 21 ప్రకారం భారత పౌరులకు లభించే భావ ప్రకటనా స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులను విదేశీ కంపెనీగా ట్విట్టర్ క్లెయిమ్ చేయజాలదని కోర్టు తేల్చి చెప్పింది.