LOADING...
Telangana: దేశంలోనే నంబర్‌ వన్‌ జల సంరక్షణ రాష్ట్రంగా తెలంగాణ
దేశంలోనే నంబర్‌ వన్‌ జల సంరక్షణ రాష్ట్రంగా తెలంగాణ

Telangana: దేశంలోనే నంబర్‌ వన్‌ జల సంరక్షణ రాష్ట్రంగా తెలంగాణ

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 12, 2025
02:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డులు-2024లో తెలంగాణ రాష్ట్రం ఘనత సాధించింది. జల్‌ సంచయ్‌ జన్‌ భాగీదారీ (జన భాగస్వామ్యంతో జల సంరక్షణ) విభాగంలో దేశవ్యాప్తంగా మొదటి ర్యాంక్‌ను తెలంగాణ దక్కించుకుంది. ఈ కార్యక్రమం కింద తెలంగాణలో మొత్తం 5,20,362పనులు పూర్తి చేయడం ద్వారా ఈ ప్రథమ స్థానం దక్కింది. రెండో, మూడో స్థానాలను వరుసగా ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లు సాధించాయి. ఈ నెల 18న న్యూదిల్లీ‌లో జరగనున్న కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజేతలకు అవార్డులను ప్రదానం చేయనున్నారు. కేంద్రం ఈ ఏడాది జల్‌ సంచయ్‌ జన్‌ భాగీదారీని సమర్థంగా అమలు చేసిన రాష్ట్రాలు, జిల్లాలు, మున్సిపల్‌ సంస్థలు, సంస్థలు, ఎన్‌జీఓలు, అధికారులు మొదలైన 100 అవార్డులను ప్రకటించింది.

Details

14 మంది నోడల్ అధికారులు

ఈ విభాగంలో మూడు రాష్ట్రాలు, 67 జిల్లాలు, ఆరు మున్సిపల్‌ కార్పొరేషన్లు, ఒక పట్టణ స్థానిక సంస్థ, రెండు మంత్రిత్వ శాఖలు/విభాగాలు, రెండు పరిశ్రమలు, మూడు ఎన్‌జీఓలు, ఇద్దరు దాతలు, 14 మంది నోడల్‌ అధికారులు ఉన్నారు. ప్రజా భాగస్వామ్యంతో జల సంరక్షణను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్రం ఈ కార్యక్రమాన్ని ఐదు జోన్లుగా విభజించి ప్రతి రాష్ట్రం కనీసం 10,000 కృత్రిమ రీఛార్జ్‌/స్టోరేజ్‌ నిర్మాణాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈశాన్య రాష్ట్రాల కోసం ఈ సంఖ్యను 3,000గా నిర్ణయించారు. ఇందులో రూఫ్‌టాప్‌ వాననీటి సంరక్షణ, చెరువులు, కుంటలు, బావుల పునరుద్ధరణ కార్యక్రమాలు ఉన్నాయి. ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, జిల్లాలు, మున్సిపల్‌ కార్పొరేషన్లను మూడు కేటగిరీలుగా విభజించి నగదు బహుమతులు ప్రకటించారు.

Details

మొదటి కేటగిరీకి రూ.2 కోట్లు

మొదటి కేటగిరీకి రూ. 2 కోట్లు, రెండవదానికి రూ. 1 కోటి, మూడవదానికి రూ. 25 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నారు. దక్షిణ జోన్‌లో జిల్లాల విభాగంలో తొలి మూడు స్థానాలను తెలంగాణే కైవసం చేసుకుంది. ఆదిలాబాద్‌ జిల్లా - 98,693 పనులు పూర్తి చేసి 1వ స్థానం నల్గొండ‌ జిల్లా - 84,827 పనులు పూర్తి చేసి 2వ స్థానం మంచిర్యాల‌ జిల్లా - 84,549 పనులు పూర్తి చేసి 3వ స్థానం.

Details

రూ.6 కోట్లకు నగదు బహుమతి

ఈ మూడు జిల్లాలకు కలిపి రూ. 6 కోట్ల నగదు బహుమతి లభించనుంది. మున్సిపల్‌ కార్పొరేషన్ల విభాగంలో కూడా తెలంగాణ మరో ఘనత సాధించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో జల సంరక్షణ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసినందుకు హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజ్‌ బోర్డు(14,363 పనులు)దేశంలో రెండో ర్యాంక్‌ సాధించింది. దీని కోసం రూ. 2 కోట్ల నగదు బహుమతి లభించనుంది. ఈ విభాగంలో ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పుర్‌ (33,082 పనులు) మొదటి స్థానంలో నిలిచింది. కేటగిరీ-2లో వరంగల్‌ (72,649 పనులు), నిర్మల్‌ (60,365 పనులు), జనగామ (30,569 పనులు)జిల్లాలు దక్షిణ జోన్‌లో మొదటి మూడు స్థానాల్లో నిలిచి రూ. 1 కోటి చొప్పున బహుమతి పొందాయి.

Details

మూడో స్థానంలో గుజరాత్

కేటగిరీ-3లో భద్రాద్రి కొత్తగూడెం (29,103 పనులు), మహబూబ్‌నగర్‌ (19,754 పనులు) వరుసగా 1వ, 3వ స్థానాలు దక్కించుకుని రూ. 25 లక్షల చొప్పున నగదు బహుమతులు పొందాయి. అదే విధంగా ఆదిలాబాద్‌, జగిత్యాల‌, కామారెడ్డి, కుమురం భీం ఆసిఫాబాద్‌, మెదక్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, సంగారెడ్డి జిల్లాల నోడల్‌ అధికారిగా వ్యవహరించిన కేంద్ర జల సంఘానికి చెందిన ఎ.సతీష్‌కు కూడా ప్రత్యేక అవార్డు లభించింది. ఇక జల సంరక్షణ, నిర్వహణలో అత్యుత్తమ రాష్ట్రంగా మహారాష్ట్రకు జాతీయ జల అవార్డు-2024 లభించింది. రెండో, మూడో స్థానాల్లో వరుసగా గుజరాత్‌, హరియాణా నిలిచాయి.

Details

మొత్తంగా 46 అవార్డులు

ఈ వివరాలను కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్‌. పాటిల్‌ ప్రకటించారు. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జల సంరక్షణ, నిర్వహణ రంగాల్లో ఉత్తమ రాష్ట్రం, ఉత్తమ జిల్లా, ఉత్తమ గ్రామ పంచాయతీ తదితరంగా మొత్తం 10 కేటగిరీలలో 46 అవార్డులు ప్రకటించబడ్డాయి. కొందరికి ఉమ్మడిగా అవార్డులు లభించాయి.