Loading...
Telangana: గ్రామాల్లో జలసిరి జోరు.. ఇంకుడు గుంతలు, రీఛార్జి నిర్మాణాలకు శ్రీకారం
గ్రామాల్లో జలసిరి జోరు.. ఇంకుడు గుంతలు, రీఛార్జి నిర్మాణాలకు శ్రీకారం

Telangana: గ్రామాల్లో జలసిరి జోరు.. ఇంకుడు గుంతలు, రీఛార్జి నిర్మాణాలకు శ్రీకారం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 20, 2026
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా జలసిరి కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయడానికి సిద్ధమైంది. నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, కరవు పరిస్థితులను ఎదుర్కోవడం,గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచడం ప్రధాన లక్ష్యాలుగా పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధిశాఖ కార్యాచరణ రూపొందించింది. జీరాంజీ పథకం కింద ఈ కార్యక్రమాలను అమలు చేయనున్నారు. ఈ ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 9.60 లక్షల ఇంకుడు గుంతలు, 5,000 ఊట కుంటలు, 5,000 బోర్‌వెల్ రీఛార్జి నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. వీటి ద్వారా వర్షపు నీటిని భూమిలోకి చేరేలా చేసి భూగర్భ జలాల నిల్వలను పెంచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

వివరాలు 

ఈ ఏడాది జులై 1న ప్రారంభమైన జీరాంజీ పథకం

మహిళా రైతులకు సాగునీటి సౌకర్యాలు మెరుగుపరచే లక్ష్యంతో ఇప్పటికే 25 వేల సేద్యపు కుంటలకు అనుమతులు మంజూరు చేశారు.

అదనంగా దరఖాస్తులు వచ్చినా వాటిని పరిశీలించి మంజూరు చేస్తామని అధికారులు తెలిపారు.

జీరాంజీ పథకం ఈ ఏడాది జులై 1న ప్రారంభమైంది. తొలి దశలో అక్టోబర్ వరకు 4.5 కోట్ల పనిదినాలు కల్పించేలా ప్రణాళిక రూపొందించారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సుమారు 2.5 లక్షల మంది కూలీలకు ఉపాధి లభిస్తుండగా, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జలసిరి కార్యక్రమాన్ని వేగవంతం చేసి రోజుకు 5 లక్షల పనిదినాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

వివరాలు 

రూ.3.50 లక్షలతో ఓపెన్ వెల్ నిర్మాణాలు చేపట్టేలా కార్యాచరణ

గ్రామస్థాయిలో నీటి సంరక్షణకు అవసరమైన పలు నిర్మాణాలను కూడా చేపట్టనున్నారు.

ప్రతి ఇంటి వద్ద రూ.6,600 వ్యయంతో వ్యక్తిగత ఇంకుడు గుంత, ప్రతి గ్రామంలో రూ.7,500తో సామూహిక ఇంకుడు గుంత, రూ.25 వేలతో బోర్‌వెల్ రీఛార్జి కుంట, అలాగే రూ.3.50 లక్షలతో ఓపెన్ వెల్ నిర్మాణాలు చేపట్టేలా కార్యాచరణ రూపొందించారు.

జలసిరి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) ఆదేశాల మేరకు సోమవారం నుంచి అన్ని జిల్లాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

నీటి సంరక్షణపై ప్రజల్లో చైతన్యం పెంచడంతో పాటు, గ్రామస్థాయిలో ఎక్కువ మంది ఈ పనుల్లో భాగస్వాములు కావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ADVERTISEMENT