Revanth Reddy: దావోస్‌లో తెలంగాణ దూకుడు.. అంతర్జాతీయ దిగ్గజాలతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీలు
ఈ వార్తాకథనం ఏంటి
దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి రోజు పర్యటన మంగళవారం సానుకూల ఫలితాలతో సాగింది. తెలంగాణతో కలిసి పని చేయడానికి అనేక అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఆసక్తి వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి గూగుల్, ఫిలిప్స్, యునిలీవర్, ఎక్స్‌పర్టైజ్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో పాటు యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. సైబర్ భద్రత,స్టార్టప్‌ల ప్రోత్సాహం,ట్రాఫిక్ నిర్వహణ,వ్యవసాయం,వాతావరణ మార్పులపై సహకారం అందించేందుకు గూగుల్ ముందుకు వచ్చింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేయనున్న భారత ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో మౌలిక సదుపాయాల నిర్మాణానికి యూఏఈ ప్రభుత్వం ఆసక్తి చూపింది.
వివరాలు
ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి యూఏఈ సహకారం
స్కిల్స్ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావడానికి సౌదీ సంస్థ ఎక్స్‌పర్టైజ్, ఏఐసీటీలో నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు ఫిలిప్స్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ స్థాపనకు యునిలీవర్ సంసిద్ధత వ్యక్తం చేశాయి. భారత్ ఫ్యూచర్ సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలన్న తెలంగాణ లక్ష్యానికి తమ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి హెచ్.ఈ. అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీ స్పష్టం చేశారు. దావోస్‌లో మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డితో జరిగిన భేటీలో ఈ అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి 'తెలంగాణ రైజింగ్ 2047' దృష్టి పత్రాన్ని వివరించారు. 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వెల్లడించారు.
వివరాలు
ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి యూఏఈ సహకారం
దేశంలోనే తొలి నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకోనుందని, అందులో ఏఐ, విద్య, వైద్యం, పరిశ్రమలు, నివాసాలు, వినోద రంగాలకు ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే మారుబేని, సెమ్‌కార్ప్ వంటి అంతర్జాతీయ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయని, రిలయన్స్ గ్రూప్ వంతారాతో కలిసి కొత్త జూ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదిరిందని సీఎం చెప్పారు. దీనిపై స్పందించిన అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీ, ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగేందుకు యూఏఈ-తెలంగాణ అధికారులతో సంయుక్త టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని, యూఏఈ ఫుడ్ క్లస్టర్ సహకారంతో తెలంగాణ గ్రామీణ, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని తమ ఆసక్తిని వ్యక్తం చేశారు.
వివరాలు
ఏటా 5వేల మంది నైపుణ్య నిపుణుల అవసరం: ఎక్స్‌పర్టైజ్
సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ సంస్థ ఎక్స్‌పర్టైజ్... యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశాన్ని వెల్లడించింది. సంస్థ ప్రెసిడెంట్, సీఈవో మొహమ్మద్ ఆసిఫ్ 'తెలంగాణ రైజింగ్' ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... విద్యా వ్యవస్థకు, పరిశ్రమల అవసరాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకే స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు... ఇది దేశంలోనే పూర్తిగా పరిశ్రమల ఆధ్వర్యంలో నడిచే తొలి విశ్వవిద్యాలయమని పేర్కొన్నారు.
వివరాలు
ఏటా 5వేల మంది నైపుణ్య నిపుణుల అవసరం: ఎక్స్‌పర్టైజ్
ఎక్స్‌పర్టైజ్ సీఈవో మొహమ్మద్ ఆసిఫ్ మాట్లాడుతూ... తమ సంస్థకు ప్రతి ఏడాది సుమారు 5వేల మంది నైపుణ్య సిబ్బంది అవసరమవుతారని, ఈ క్రమంలో స్కిల్స్ యూనివర్సిటీతో కలిసి యువతకు శిక్షణ అందిస్తామని తెలిపారు. మధ్య ఆసియా ప్రాంతంలో ఈ సంస్థ పెట్రో కెమికల్స్, చమురు, సహజ వాయువు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, నీటిశుద్ధి, విద్యుదుత్పత్తి రంగాల్లో ప్లాంట్ నిర్వహణ సేవలు అందిస్తోంది.
వివరాలు
జీసీసీపై యునిలీవర్ సానుకూల స్పందన
దావోస్‌లో రేవంత్‌రెడ్డి బృందం యునిలీవర్ చీఫ్ సప్లై చైన్ అండ్ ఆపరేషన్స్ ఆఫీసర్ విలియం ఉయిజెన్‌తో సమావేశమైంది. తెలంగాణలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది. హైదరాబాద్ జీసీసీలకు కేంద్రంగా ఎదుగుతోందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. దీనిపై స్పందించిన విలియం ఉయిజెన్, జీసీసీ ఏర్పాటు అవకాశాలను యునిలీవర్ సానుకూలంగా పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ... హైదరాబాద్‌లో ఇప్పటికే మెక్‌డొనాల్డ్స్, హైనెకెన్, కాస్టకో వంటి ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థల జీసీసీలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
వివరాలు
తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ సన్నద్ధం
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్... అనేక రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని ప్రకటించింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో గూగుల్ ఏపీఏసీ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. వాతావరణ మార్పులు, వ్యవసాయంపై దాని ప్రభావం, పట్టణ కాలుష్యం వంటి సమస్యలపై చర్చించారు. హైదరాబాద్‌లో గూగుల్ ఫర్ స్టార్టప్స్ తొలి హబ్‌ను ఏర్పాటు చేసినందుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సంజయ్ గుప్తా మాట్లాడుతూ...ట్రాఫిక్ నియంత్రణ,సైబర్ భద్రత,వ్యవసాయం,స్టార్టప్‌లు, వాతావరణ మార్పుల అంశాల్లో తెలంగాణకు సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. మంత్రి శ్రీధర్‌బాబు... స్కిల్స్ యూనివర్సిటీ, బీఎఫ్‌ఎస్‌ఐ స్కిల్లింగ్, ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలాతో భాగస్వామ్యం, ఏఐ పాఠ్యాంశాల అమలు వంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
వివరాలు
ఏఐపై ఫిలిప్స్ ప్రత్యేక ఆసక్తి
కృత్రిమ మేధ రంగంలో తెలంగాణతో భాగస్వామ్యం కావడానికి ప్రముఖ హెల్త్ టెక్ సంస్థ రాయల్ ఫిలిప్స్ ఆసక్తి చూపింది. హైదరాబాద్‌లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటు అవకాశాలపై చర్చలకు ముందుకొచ్చింది. సంస్థ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ హెడ్ జాన్ విలియమ్స్ స్కీజ్ గ్రాండ్ మాట్లాడుతూ... ఆరోగ్య రంగంలో తెలంగాణ అమలు చేస్తున్న ఏఐ ఆధారిత సేవలు ప్రశంసనీయమని, నెదర్లాండ్స్‌లోని తమ ప్రధాన కార్యాలయాన్ని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సందర్శించాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా 'తెలంగాణ నెక్ట్స్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30'ను ప్రతినిధులు వివరించారు. 2030 నాటికి 250 బిలియన్ డాలర్ల లైఫ్ సైన్సెస్ ఆర్థిక వ్యవస్థ నిర్మించడమే లక్ష్యమని, మెడికల్ ఎలక్ట్రానిక్స్ సహా అనుబంధ రంగాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు.
వివరాలు
ఏఐపై ఫిలిప్స్ ప్రత్యేక ఆసక్తి
సీఎం రేవంత్‌రెడ్డి... ఔషధ తయారీ, పరిశోధనాభివృద్ధిలో ప్రపంచ స్థాయి, స్థిరమైన పారిశ్రామిక క్లస్టర్‌ను తెలంగాణలో నిర్మిస్తున్నామని చెప్పారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ... కొత్త లైఫ్ సైన్సెస్ విధానం, ఔషధ తయారీ వ్యూహాలు కలిసి 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు బలమైన పునాది వేస్తాయని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రెండువేలకుపైగా లైఫ్ సైన్సెస్ సంస్థలు, బలమైన ఐటీ-లైఫ్ సైన్సెస్-హెల్త్‌కేర్ టాలెంట్, జీనోమ్ వ్యాలీ, 300 ఎకరాలకు పైగా విస్తరించిన మెడికల్ డివైజెస్, మెడికల్ ఎలక్ట్రానిక్స్ పార్కులు ఉన్నాయని, హైదరాబాద్‌లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు ఇదే సరైన అవకాశమని స్పష్టం చేశారు.