
Rain alert: నైరుతి రుతుపవనాల తిరోగమనం..మరో రెండ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు తిరోగమనం కొనసాగుతుంది. ఈ రోజు పూర్తిగా రాష్ట్రం నుంచి, అలాగే దేశం మొత్తంలోనూ ఉపసంహరించుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు దక్షిణ భారత ద్వీపకల్పంలోకి ప్రవేశించే సూచనలున్నాయి. ఈ పరిణామాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నైరుతి రుతుపవనాల తిరోగమనం కారణంగా ఈ రోజు నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్,హనుమకొండ,కామారెడ్డి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని అంచనా. కొన్ని చోట్ల తేలికపాటి ఉరుములు,పిడుగులు సంభవించవచ్చు.గాలులు గంటకు 40కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
వివరాలు
శుక్రవారం వర్షాలు కురిసే జిల్లాలు
రేపు (శుక్రవారం) కూడా నైరుతి రుతుపవనాల ప్రభావం కొనసాగనుంది. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఏపీలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ వాతావరణం తేమతో నిండిపోవడంతో పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రకాశం,నెల్లూరు,తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పిడుగులతో కూడి కురిసే అవకాశముండగా,అనంతపురం,శ్రీ సత్యసాయి,కడప,అన్నమయ్య,చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ తీర ప్రాంతాల్లో గంటకు 35 నుండి 45కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.