LOADING...
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసులు..? 
కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసులు..?

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసులు..? 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 23, 2025
02:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో త్వరలోనే కీలక మలుపు తిరగబోతోందా అనే చర్చ ఊపందుకుంది. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు నోటీసులు జారీ చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాకుండా, మాజీ మంత్రి హరీశ్ రావుకూ నోటీసులు ఇవ్వడానికి సిట్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నేతృత్వంలో తొమ్మిది మంది సీనియర్ పోలీస్ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సిట్ తన విచారణను అత్యంత వేగంగా కొనసాగిస్తోంది.

వివరాలు 

దర్యాప్తును మరింత వేగవంతం చేసిన సిట్ 

ఇందులో భాగంగా ప్రధాన నిందితుడిగా గుర్తించిన మాజీ ఎస్బీఐ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన వాంగ్మూలం, అలాగే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) అందించిన సాంకేతిక సమాచారాన్ని ఆధారంగా తీసుకుని, కొత్తగా ఏర్పాటైన సిట్ రాజకీయ స్థాయి అగ్రనేతలపై తొలిసారిగా చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ఎవరి ప్రయోజనం కోసం నిర్వహించారు? ఎవరి ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టారు? అనే అంశాలపైనే సిట్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. దీనితో దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న ఆదేశాలపై సిట్ బృందం ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

వివరాలు 

మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసిన  సిట్ 

విచారణ సందర్భంగా ప్రభాకర్ రావు పదేపదే అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి, అలాగే అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ పేర్లను ప్రస్తావించినట్లు సిట్ చీఫ్ సజ్జనార్ గుర్తించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి వాంగ్మూలాన్ని ఇప్పటికే సిట్ నమోదు చేసింది. ఇక తదుపరి దశలో రాజకీయ నాయకులకు నోటీసులు జారీ చేయడంపై దృష్టి సారించింది. అందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులకు నోటీసులు ఇవ్వడానికి సిట్ సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ పరిణామాలతో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని రాజకీయ, న్యాయపరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

Advertisement