Telangana: తెలంగాణ వైద్యశాఖలో 2,929 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో నిరుద్యోగులకు మరోసారి ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 2,929 పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో ఇప్పటికే 996 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి లభించగా, మరో 1,933 పోస్టులకు ఆమోదం రావాల్సి ఉంది. అనుమతులు పూర్తయిన వెంటనే నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశముంది.
వివరాలు
996 పోస్టులకు ఇప్పటికే ఆమోదం
ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన 996 పోస్టుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (198), ఆయుష్ ఫార్మసిస్ట్ గ్రేడ్-2 (308), టెక్నీషియన్ (290) పోస్టులు ప్రధానంగా ఉన్నాయి.
వీటితో పాటు బయోమెడికల్ ఇంజినీర్లు, ఫిజియోథెరపిస్టులు, రేడియోగ్రాఫర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎం పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.
తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, వైద్య విద్య సంచాలకుల కార్యాలయం (డీఎంఈ), ఆయుష్, ఎంఎన్‌జే తదితర విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు.
వివరాలు
మరో 1,933 పోస్టులకు ఆమోదం రావాల్సి ఉంది
ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్న 1,933 పోస్టుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ (716), సివిల్ అసిస్టెంట్ సర్జన్ (మొత్తం 422), స్టాఫ్ నర్సు (194), ల్యాబ్ టెక్నీషియన్ (96) పోస్టులు ఉన్నాయి.
వీటికి ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించిన వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ఈ నియామకాలను మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంఆర్‌బీ) ద్వారా చేపట్టి ప్రక్రియను వేగవంతం చేయనున్నారు.
అయితే జూనియర్ అసిస్టెంట్ పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) భర్తీ చేయనుంది.
వివరాలు
కొనసాగుతున్న 2,711 పోస్టుల నియామకాలు
మరోవైపు, ప్రస్తుతం ఎంఆర్‌బీ ఆధ్వర్యంలో 2,711 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.
ఇందులో 1,931 ఎంపీహెచ్‌ఏ (మహిళ) పోస్టుల నియామకాలు దాదాపు పూర్తయ్యాయి. త్వరలోనే వీటికి సంబంధించిన తుది ఎంపిక జాబితాను విడుదల చేయనున్నారు.
అలాగే 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల కోసం 4 వేలకు పైగా దరఖాస్తులు అందాయి. దీంతో దరఖాస్తుల పరిశీలనకు మరికొంత సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు వైద్యారోగ్య శాఖలో మొత్తం 13,401 పోస్టులను భర్తీ చేయడం గమనార్హం.
తాజాగా మరో 2,929 పోస్టుల భర్తీకి కసరత్తు జరుగుతుండటంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది.